
ప్రమాణ స్వీకారానికి బెంగాల్‌కు మళ్లీ వస్తా: ప్రధాని మోడీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ(బీజేపీ) గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని సోమవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీ విశ్వాసం వ్యక్తం చేశారు. మే 4 తర్వాత ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మళ్లీ బెంగాల్‌కు వస్తానని చెప్పారు. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలోని బరాక్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. రెండో, తుది దశ ప్రచారం ముగింపు సందర్భంగా ఆయన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేను బెంగాల్ అంతా తిరిగాను. ప్రజల మూడ్ చూసి వస్తున్నాను. మే 4 తర్వాత బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కోసం మళ్లీ రావాల్సిందే అనిపిస్తోందని అన్నారు. బరాక్‌పూర్ ప్రాంత చారిత్రక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ, 1857 స్వాతంత్ర్య సమరంలో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించిందని, ఇప్పుడు బెంగాల్‌లో మార్పుకు వేదికగా మారుతోందని తెలిపారు. తూర్పు భారత అభివృద్ధి దేశ ప్రగతికి కీలకమని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధిలో అంగ, బంగ, కళింగ అనే మూడు స్తంభాలు కీలకం. ఇవి బలహీనపడినప్పుడు దేశానికి నష్టం జరిగింది. ఇప్పుడు తూర్పు ప్రాంతం మళ్లీ బలపడాలని అన్నారు.
కమలం గుర్తుకు ఓటేయండి
పక్క రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ బీహార్, ఒడిశాలో కమలం వికసించింది. ఇప్పుడు బెంగాల్ వంతని వ్యాఖ్యానించారు. టీఎంసీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ, రాష్ట్రంలో ‘సిండికేట్ రాజ్’, రాజకీయ హింస, అక్రమ చొరబాట్లు పెరిగాయని ఆరోపించారు. పరిశ్రమలు మూతపడుతున్నాయి, కానీ బాంబుల తయారీ కేంద్రాలు పెరుగుతున్నాయి. ఇది జంగిల్ రాజ్ అని అన్నారు. టీఎంసీ తన ‘మా, మాటీ, మానుష్’ నినాదాన్ని మరిచిపోయిందని ఆరోపించారు. మహిళల భద్రతపై ప్రశ్నిస్తూ, ఈసారి ఓటు వేయడానికి వెళ్లినప్పుడు బాధితుల గురించి ఆలోచించండి. మహిళలు రాత్రివేళ భయం లేకుండా బయటకు రావాలంటే కమలం గుర్తుకు ఓటు వేయండని పిలుపునిచ్చారు.
కోల్‌కత్తా నగరంపై కూడా వ్యాఖ్యానిస్తూ లండన్‌లా మారుస్తామని చెప్పారు. కానీ నగర స్వరూపం మార్చేశారు. అక్రమ చొరబాటుదారులను స్థిరపడేలా చేశారని అన్నారు. భారత పౌరుల భద్రతపై హామీ ఇస్తూ ఏ భారతీయుడికీ సమస్య ఉండదు. కానీ అక్రమంగా వచ్చిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మటువా సమాజాన్ని ఉద్దేశించి, బీజేపీ ప్రభుత్వం వస్తే అర్హులైన శరణార్థులకు పౌరసత్వం, అవసరమైన పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు. శ్యామప్రసాద్ ముఖర్జీని ప్రస్తావిస్తూ, ఆయన ఆశయాలను బీజేపీ నెరవేర్చుతోందని తెలిపారు. ఆర్టికల్ 370 రద్దు ఒక ముఖ్యమైన అడుగని అన్నారు. ఉద్యోగాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, పారదర్శక నియామకాలు, ఖాళీల భర్తీ, 7వ వేతన సంఘం ప్రయోజనాలు, గ్రామీణ ఉపాధి హామీ, కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ వంటి పథకాలు అమలు చేస్తామని చెప్పారు. ఇవి కేవలం హామీలు కాదు… ఇది మోడీ గ్యారంటీ అని అన్నారు. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ్‌ను ప్రస్తావిస్తూ వందేమాతరం స్వాతంత్ర్యానికి నినాదమైతే, ఇప్పుడు బెంగాల్ పునర్నిర్మాణానికి మార్గదర్శకంగా మారాలని ముగించారు.
