
ఏబీఎన్ రాధాకృష్ణపై చర్యలు తీసుకోవడంలో ఆలస్యం ఎందుకు:వైసీపీ
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థాధిపతి వేమూరి రాధాకృష్ణపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు తిరుపతి ఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ, జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని తెలిపారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ వ్యవస్థ నిర్లక్ష్యం ప్రదర్శించడం సరైంది కాదని విమర్శించారు. మహిళల భద్రత, గౌరవం కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే సమాజానికి సరైన సందేశం వెళ్తుందని ఆయన పేర్కొన్నారు.
ఇక ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఇదే అంశంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో నాయకులు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, వైసీపీ నేతల కుటుంబ సభ్యులపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పటికీ ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం పోలీసుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టినా అధికార యంత్రాంగం స్పందించకపోవడం విచారకరమన్నారు.
కాగా పోలీస్ వ్యవస్థ వైసీపీకి వ్యతిరేకంగా తప్పుడు కేసులు నమోదు చేస్తోందని ఆరోపించిన ఆయన అదే సమయంలో మహిళలను కించపరిచే వ్యాఖ్యలపై చర్యలు తీసుకోకపోవడం ద్వంద్వ వైఖరిని చూపుతోందని ఫిర్యాదులు స్వీకరించడానికే అధికారులు వెనుకాడుతున్నారని ఆరోపించారు. మహిళల పట్ల గౌరవం ఉంటే సంబంధిత నాయకులు బహిరంగ క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వెంటనే కేసు నమోదు చేసి న్యాయం చేయాలని వారు పోలీస్ అధికారులను కోరారు.
