
బండి బగీరథ్ పోక్సో కేసుపై కేసీఆర్ మౌనం ఎందుకు?: సీఎం రేవంత్ రెడ్డి
బండి బగీరథ్‌పై నమోదైన పోక్సో కేసు వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మౌనం వహించడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. ఒక మైనర్ బాలికకు ఇంత పెద్ద అన్యాయం జరిగితే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బయటకు వచ్చి మాట్లాడే ధైర్యం లేకపోతే కనీసం ఒక ప్రకటన అయినా విడుదల చేయకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీల నేతలను బీఆర్ఎస్‌లోకి చేర్చుకోవడానికి జగిత్యాల వరకు వెళ్తున్న కేసీఆర్‌కు బాధితురాలికి మద్దతుగా మాట్లాడే తీరిక లేదా అని సీఎం నిలదీశారు.
నాకాబందీలోనే బగీరథ్ అరెస్ట్.. లొంగిపోలేదు
బండి సంజయ్ తన కుమారుడిని పోలీసులకు సహకరించాలని సూచించానంటూ చేసిన వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి కొట్టిపారేశారు. బగీరథ్ నిజంగానే స్వచ్ఛందంగా లొంగిపోవాలని అనుకుంటే పోలీసులను స్వయంగా పిలిచి అప్పగించాల్సి ఉండేదన్నారు. కానీ పోలీసులు నిర్వహించిన ‘నాకాబందీ’ (తనిఖీల) సమయంలోనే బగీరథ్‌ను అరెస్ట్ చేశారని తాను పోలీసుల అధికారిక సమాచారాన్నే నమ్ముతున్నానని స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ప్రభుత్వం ఎవరికీ అతీతం కాదని తేల్చి చెప్పారు. గతంలో కూడా బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులను బగీరథ్ బెదిరించి డబ్బు వసూలు చేశారనే ఆరోపణలపై ఫిర్యాదులు ఉన్న విషయాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా గుర్తుచేశారు.
బీఆర్ఎస్‌వి సిగ్గులేని రాజకీయాలు
పోక్సో కేసును కూడా బీఆర్ఎస్ నేతలు రాజకీయం చేస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. సోషల్ మీడియాలో బాధిత బాలిక ఆమె కుటుంబ సభ్యుల ఫోటోలను ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, దీనిని “సిగ్గులేని రాజకీయాలు”గా అభివర్ణించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లేందుకే బీఆర్ఎస్ ఇలాంటి దిగజారుడు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కేటీఆర్ బంధువు ఫార్మ్‌హౌస్‌లో మాదకద్రవ్యాలు లభించాయన్న ఆరోపణలపై చట్టప్రకారమే నోటీసులు జారీ చేశామని స్పష్టం చేశారు. అదేవిదంగా గతంలో ఫార్మ్‌హౌస్ వద్ద పోలీసులపై కాల్పులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ పార్టీ మాజీ ఎమ్మెల్యేపై బీఆర్ఎస్ అధిష్టానం ఎందుకు చర్యలు తీసుకోలేదని సీఎం ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్లపై ‘వ్యవస్థీకృత నేరం’
ఇదిలా ఉండగా రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనుగోలు ప్రక్రియను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల నుంచి దింపకుండా అడ్డుకుంటూ కొనుగోలు ప్రక్రియకు అంతరాయం కలిగిస్తున్నారని, ఇది ముమ్మాటికీ బీఆర్ఎస్ చేస్తున్న వ్యవస్థీకృత నేరం అని వ్యాఖ్యానించారు. రైతులు ప్రకృతి విపత్తులు లేదా ప్రమాదాల్లో మరణించినప్పుడు వారికి సహాయం చేయాల్సింది పోయి బీఆర్ఎస్ నేతలు శవాల వద్ద సెల్ఫీలు దిగుతూ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.
ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో 80 శాతం ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసిందని సీఎం వెల్లడించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కారణంగా అక్కడి నుంచి వచ్చిన హమాలీలు (కార్మికులు) స్వస్థలాలకు వెళ్లడంతోనే కొన్ని రోజుల పాటు కొనుగోళ్లలో స్వల్ప అంతరాయం ఏర్పడిందని అంతకు మించి ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేశారు.
కేంద్రంపై విమర్శలు
ఇదే సమయంలో ఇంధన ధరల పెంపుపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కూడా రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నంత కాలం ఇంధన ధరలను పెంచకుండా నిలిపివేసిన కేంద్రం ఎన్నికలు ముగియగానే ఇప్పుడు దాదాపు ప్రతిరోజూ ధరలను పెంచుకుంటూ పోతోందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలన్నీ కేవలం రాజకీయ కోణంలోనే సాగుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
