Let's talk: editor@tmv.in
మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమల్లోకి ఎందుకు రాలేదు: మమతా బెనర్జీ

మహిళా రిజర్వేషన్ ఇప్పటి వరకు అమల్లోకి ఎందుకు రాలేదు: మమతా బెనర్జీ

Pinjari Chand
17 ఏప్రిల్, 2026

మహిళా రిజర్వేషన్ చట్ట సవరణకు సంబంధించిన బిల్లులు, డీలిమిటేషన్ బిల్లును అనుసంధానం చేయడం ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించి ఎన్‌ఆర్‌‌సీ అమలు చేయడానికి చేస్తున్న కుట్ర అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కూచ్‌బెహార్ జిల్లాలోని మథాభంగా వద్ద నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆమె, మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను కలిపి తీసుకురావడం ద్వారా దేశాన్ని విభజించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ రెండు బిల్లులను అనుసంధానం చేయడం ఓటర్ల పేర్లు తొలగించేందుకు, అలాగే నేషనల్‌ రిజిస్ట్రార్‌‌ ఆఫ్‌ సిటిజన్స్‌ అమలు చేయడానికి జరుగుతున్న కుట్ర అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలం క్రితమే ఆమోదం పొందిందని, అయితే ఇప్పటివరకు అమలులోకి ఎందుకు రాలేదని మమత ప్రశ్నించారు. తమ పార్టీ టీఎంసీ లోక్‌సభ ఎంపీలలో 37 శాతం మహిళలేనని ఆమె పేర్కొన్నారు. ఇక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పశ్చిమ బెంగాల్ పర్యటనలో మహిళలకు కార్డులు పంపిణీ చేశారని మమత ఆరోపించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ వెంటనే చర్యలు తీసుకుని ఆమెను పదవి నుంచి తొలగించాలని సవాల్ విసిరారు.

బీజేపీ నాయకులు ఫారాలు పంచుతున్నారు

బీజేపీ నాయకులు ‘మాతృశక్తి భరోసా కార్డ్’ అనే పథకాన్ని ప్రకటించి మహిళలకు ఆర్థిక సహాయం ఇస్తామని చెప్పుతూ ఫారమ్‌లు పంపిణీ చేస్తున్నారని టీఎంసీ ఆరోపించింది. దీనిని ఎన్నికల లంచంగా పేర్కొంటూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు పార్టీ తెలిపింది. అలిపుర్దువార్‌లో జరిగిన మరో ర్యాలీలో మమత మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, అస్సాం రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు బెంగాల్‌లోని హోటళ్లలో పెద్ద మొత్తంలో డబ్బుతో ఉండి ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇక మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్‌ఠాక్రే, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌, ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌యాదవ్‌ వంటి ప్రతిపక్ష నాయకులు బెంగాల్‌కు వచ్చి తనకు మద్దతు తెలపాలని ఆసక్తి చూపుతున్నారని మమత తెలిపారు. బెంగాల్ ఎన్నికల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా ఆమె పిలుపునిచ్చారు. బీజేపీ ఎన్నికల సమయంలో బాంబులు పెట్టి తర్వాత ఎన్‌ఐఏ ద్వారా విచారణ జరిపించే ప్రయత్నం చేయవచ్చని ఆమె ఆరోపించారు.