Let's talk: editor@tmv.in
బాగేశ్వర్‌‌ బాబా వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు: సంజయ్‌రౌత్‌

బాగేశ్వర్‌‌ బాబా వ్యాఖ్యలపై ఎందుకు స్పందించలేదు: సంజయ్‌రౌత్‌

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్‌రౌత్‌ ఆదివారం పలు రాజకీయ పరిణామాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా బాగేశ్వర్ బాబా వ్యాఖ్యల వివాదం, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎంపీలు బీజేపీలో చేరిక అంశాలపై ఆయన ఘాటుగా స్పందించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఆధ్యాత్మిక నాయకుడు ధీరేంద్ర క్రిష్ణ శాస్త్రి చేసిన వ్యాఖ్యలపై రౌత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ చరిత్రను వక్రీకరించేవిగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రకు వచ్చి, ముఖ్యమంత్రి సమక్షంలో, ఇతర నాయకుల ఎదుట శివాజీ మహారాజ్ చరిత్రను మార్చి మాట్లాడితే అధికారంలో ఉన్నవారు స్పందించాలి కదా? అని ప్రశ్నించారు. అలాగే ఆయన నేరుగా ప్రశ్నిస్తూ ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ ఎందుకు కోపం వ్యక్తం చేయలేదు? అని అన్నారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్‌ భగవత్‌ హాజరైన నేపథ్యంలో వారి మౌనంపై రౌత్ విమర్శలు గుప్పించారు. చరిత్రపై అవగాహన అవసరమని చెబుతూ మహారాష్ట్ర చరిత్రను ముందుగా చదవాలి. శివాజీ మహారాజ్ వల్లే ఈ రోజు మనం హిందువులుగా జీవిస్తున్నామని బాగేశ్వర్ బాబాకు సూచించారు. ఈ వివాదంపై కాంగ్రెస్ నేత విజయ్‌ వాడేట్టివార్‌‌ కూడా స్పందిస్తూ శివాజీ మహారాజ్ చరిత్ర చదివారా? మహారాష్ట్ర నేలపై ఆయనను అవమానించారు. ఎవరు ఈ హక్కు ఇచ్చారు? అని ప్రశ్నించారు.

ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీలు బీజేపీలో చేరికపై విమర్శలు

ఇక ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏడుగురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన ఘటనపై రౌత్ తీవ్రంగా స్పందించారు. మహాభారతంలో బకాసురుడు ఉన్నాడు. అతనికి ఆకలి తీరదు. బీజేపీ కూడా అలాగే ఏదైనా మింగేస్తుందంటూ ఆయన విమర్శించారు. ఆప్ నుంచి వెళ్లిన ఎంపీలను ఆయన పేజ్-3 నాయకులుగా అభివర్ణించారు. ధనవంతులు కావడంతో రక్షణ కోసం బీజేపీలో చేరారని ఆరోపించారు. ఇతర పార్టీల చెత్త అంతా బీజేపీకి వెళ్తే అది డంపింగ్ యార్డ్ అవుతుందని అన్నారు బీజేపీ రాజకీయాలను నిర్లజ్జమైనవిగా అభివర్ణించారు. అలాగే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ విమర్శించారు. తన వ్యక్తిగత అనుభవాన్ని కూడా వెల్లడిస్తూ, బీజేపీలో చేరాలని తనపై ఒత్తిడి వచ్చిందని, కానీ పార్టీని వదల్లేదని చెప్పారు. 2022లో మనీలాండరింగ్ కేసులో అరెస్టై జైలుకెళ్లినా, తర్వాత బెయిల్‌పై విడుదలయ్యానని తెలిపారు.