Let's talk: editor@tmv.in
తెలంగాణ కొత్త ‘సీఎస్’ ఎవ‌రు?

తెలంగాణ కొత్త ‘సీఎస్’ ఎవ‌రు?

Gaddamidi Naveen
15 జూన్, 2026

తెలంగాణ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) నియామకంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) కె. రామకృష్ణారావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర పరిపాలనా వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.

ఇప్పటికే రెండు సార్లు పదవీ పొడిగింపు పొందిన రామకృష్ణారావుకి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరోసారి కూడా అవకాశం కల్పిస్తారా? లేక కొత్త సీఎస్‌ను నియమిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే, మూడోసారి పొడిగింపు ఇవ్వడం అసాధారణ నిర్ణయంగా భావిస్తున్న నేపథ్యంలో, ప్రభుత్వం కొత్త సీఎస్ నియామకంపైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే కొత్త సీఎస్ ఎంపికపై కసరత్తు వేగవంతమైంది.

కొత్త సీఎస్ రేసులో సీనియర్ ఐఏఎస్ అధికారులైన జయేష్ రంజన్, వికాస్ రాజ్, సంజయ్ జాజు, సవ్యసాచి ఘోష్ పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో జయేష్ రంజన్ పేరు ఎక్కువగా చర్చకు వస్తోంది. ఐటీ, పరిశ్రమలు, పెట్టుబడులు, పట్టణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆయనకు ఉన్న అనుభవం, పరిపాలనా సామర్థ్యం ఆయనకు బలంగా మారినట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వికాస్ రాజ్ కూడా సీఎస్ రేసులో కీలక పోటీదారుగా నిలిచినట్లు సమాచారం. అయితే, రాష్ట్ర అత్యున్నత పరిపాలనా అధికారి ఎంపికపై తుది నిర్ణయం పూర్తిగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది. జూన్ చివరి వారంలో ఈ కీలక పదవిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాలు భావిస్తున్నాయి.