Let's talk: editor@tmv.in
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది?: నితిన్ నబిన్‌కు ఎంపీ కిరణ్ కుమార్ కౌంటర్

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది?: నితిన్ నబిన్‌కు ఎంపీ కిరణ్ కుమార్ కౌంటర్

Gaddamidi Naveen
30 జూన్, 2026

కేంద్రంలోనూ, రాష్ట్రాల్లోనూ తమ పాలనపై వస్తున్న విమర్శలను సమర్థించలేని పరిస్థితి వచ్చినప్పుడల్లా, ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు వ్యక్తుల మూలాలను ప్రశ్నిస్తూ చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నారని భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఒక వీడియో సందేశం ద్వారా ఘాటుగా స్పందించారు.

నితిన్ నబిన్ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ "ఇటాలియన్ మైండ్‌సెట్" అని మాట్లాడటాన్ని ఎంపీ తప్పుపట్టారు. తెలంగాణ ప్రజలు చరిత్రను మరచిపోలేదని కిరణ్ కుమార్ అన్నారు. దశాబ్దాల తరబడి సాగిన సుదీర్ఘ పోరాటాలు, వేలాది మంది అమరవీరుల త్యాగాలను గౌరవించి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షకు రాజకీయంగా పూర్తి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ. ఆమె చొరవ వల్లే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం చేసిందని గుర్తు చేశారు.

తెలంగాణ ప్రజలు న్యాయం కోసం, హక్కుల కోసం రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తున్న సమయంలో ఈ బీజేపీ నాయకులు ఎక్కడ ఉన్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వెలువడిన తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం కంటే, ఉద్యమ సమయంలో ప్రజలతో నిలబడిన వారినే చరిత్ర గుర్తుంచుకుంటుందని పేర్కొన్నారు.

దేశభక్తి అనేది పుట్టిన ప్రదేశం లేదా కుటుంబ నేపథ్యం ఆధారంగా నిర్ణయించబడదని, భారత రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల ఆకాంక్షలకు అండగా నిలవడమే నిజమైన దేశభక్తికి నిదర్శనమని కిరణ్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రజలు తమ రాష్ట్ర ఆకాంక్షలను గౌరవించిన నాయకులను ఎప్పటికీ గుర్తుంచుకుంటారని, దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ప్రజల నిత్యజీవిత సమస్యలపై సమాధానాలు చెప్పకుండా బీజేపీ కేవలం విభజన రాజకీయాలు, రెచ్చగొట్టే ప్రసంగాలతో పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. ఇలాంటి మాటల విన్యాసాలు చేసేవారిని ప్ర‌జ‌లు నమ్మరని ఆయన హితవు పలికారు.

ట్యాగ్‌లు
TelanganaCongressBJPNitinNabinKiranKumarChamalaSoniaGandhiTelanganaFormationTelanganaPoliticsPoliticalNewsBreakingNews
తెలంగాణ ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది?: నితిన్ నబిన్‌కు ఎంపీ కిరణ్ కుమార్ కౌంటర్ - Tholi Paluku