Let's talk: editor@tmv.in
‘పూరీ జగన్నాథ’ ఖజానా తాళాలెక్కడ?: బీజేపీ

‘పూరీ జగన్నాథ’ ఖజానా తాళాలెక్కడ?: బీజేపీ

Pinjari Chand
24 ఏప్రిల్, 2026

ఒడిశాలో పూరి జగన్నాథ ఆలయానికి చెందిన రత్న భండార్ (ఖజానా గది) భద్రతపై బీజేపీ–బీజేడీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత తీవ్రంగా మారింది. రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రిత్విరాజ్ హరిచందన్, గత బీజేడీ ప్రభుత్వం అసలు తాళాలు పోగొట్టుకున్న తర్వాత నకిలీ తాళాలు తయారు చేసిందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు బీజేడీ సీనియర్ నేత ప్రణబ్ ప్రకాశ్ దాస్ చేసిన సోషల్ మీడియా పోస్టులకు ప్రతిస్పందనగా వచ్చాయి. దాస్ మాట్లాడుతూ, రత్న భండార్ అంశాన్ని బీజేపీ ఎన్నికల కోసం రాజకీయంగా ఉపయోగించుకుందని విమర్శించారు. జగన్నాథ స్వామి ఆభరణాలు సురక్షితం కాదని ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన ఆరోపించారు.

దీనికి హరిచందన్ కౌంటర్ ఇస్తూ అసలు తాళాలు ఎక్కడ? అవి మిస్సయ్యాయి. తర్వాత బీజేడీ ప్రభుత్వం నకిలీ తాళాలు తయారు చేసింది. అవి తలుపులకు సరిపోకపోవడంతో మేజిస్ట్రేట్ సమక్షంలో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అతను ఇంకా ప్రశ్నిస్తూ బీజేడీ 24 సంవత్సరాల పాలనలో రత్న భండార్ ఎందుకు తెరవలేదు? అని నిలదీశారు. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం 48 సంవత్సరాల తర్వాత రత్న భండార్ ఇన్వెంటరీ ప్రక్రియను ప్రారంభించిందని, దీనిని స్నాన పౌర్ణిమ (జూన్ 29)కి ముందే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

అభరణాల లెక్కలు సరిపోయాయి

ఇదిలా ఉంటే, శ్రీజగన్నాథ ఆలయ పరిపాలన తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఉన్న ఆభరణాల లెక్కలు 1978 రికార్డులతో సరిపోతున్నాయని తెలిపింది. దీంతో ఆభరణాలు మాయం అయ్యాయన్న ఆరోపణలకు బీజేడీ బలంగా సమాధానం ఇచ్చింది. దాస్ మాట్లాడుతూ రత్న భండార్ ఒడిశా గర్వానికి ప్రతీక. తప్పుడు ఆరోపణలు చేసినవారు భక్తులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఈ వ్యవహారం నేపథ్యంలో రాజకీయ ఆరోపణలు–ప్రత్యరోపణలు కొనసాగుతుండగా, రత్న భండార్ తాళాల గల్లంతుపై న్యాయ విచారణ కమిషన్ నివేదికను త్వరలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.