Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌లో ‘ఎన్టీఆర్’ విగ్రహం ఏర్పాటు వెనుక కారణం ఏమిటి?

హైదరాబాద్‌లో ‘ఎన్టీఆర్’ విగ్రహం ఏర్పాటు వెనుక కారణం ఏమిటి?

Gaddamidi Naveen
30 మే, 2026

హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. తెలుగుదేశం పార్టీ (టీడీపీ) వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) విగ్రహాన్ని నగర నడిబొడ్డున ఆవిష్కరించడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మక అడుగు వేశారు. ఎన్టీఆర్ అభిమానులను, టీడీపీ సానుభూతిపరులను కాంగ్రెస్ వైపు తిప్పుకునేందుకే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని నగరంలోని అమీర్‌పేట్ లో ఏర్పాటు చేసిన 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్టీఆర్ అనే వ్యక్తి కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతుడైన ఒక మహోన్నత శక్తి అని కొనియాడారు.

విమర్శలపై రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్

జీవితకాలమంతా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడిన ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆవిష్కరించడంపై వస్తున్న విమర్శలను రేవంత్ రెడ్డి తిప్పికొట్టారు. ఎన్టీఆర్ ఆంధ్ర ప్రాంతానికి చెందినవారనే వాదనలను కూడా ఆయన తోసిపుచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఎంత ముఖ్యమో, ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. మా ప్రభుత్వం ఈ ఇద్దరు మహోన్నత నాయకుల ఆశయాల స్ఫూర్తితోనే ప్రజల కోసం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని సీఎం స్పష్టం చేశారు.

రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి దీనిపై స్పందిస్తూ.. రేవంత్ రెడ్డి ఇటు ఇందిరా గాంధీ సిద్ధాంతాలను, అటు ఎన్టీఆర్ సంక్షేమ సిద్ధాంతాలను మిళితం చేసి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ వారసత్వాన్ని తనదిగా తీసుకోవడం ద్వారా హైదరాబాద్‌లోని ఆంధ్ర ప్రాంత ఓటర్లను, అలాగే ఎన్టీఆర్ సానుభూతిపరులను కాంగ్రెస్ వైపు తిప్పుకోవడంలో రేవంత్ రెడ్డి విజయం సాధించే అవకాశం ఉందని ఆయన విశ్లేషించారు. గతంలో టీడీపీలోనే పనిచేసిన రేవంత్ రెడ్డి, 2017లో కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.

మున్సిపల్ ఎన్నికల వేళ ‘అమీర్‌పేట్’ వ్యూహం

హైదరాబాద్‌లోని అమీర్‌పేట్, దాని పరిసర ప్రాంతాలలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఓటర్లు, టీడీపీ సానుభూతిపరులు అత్యధిక సంఖ్యలో నివసిస్తున్నారు. ఎన్టీఆర్ మరణించి మూడు దశాబ్దాలు కావస్తున్నా, ఇప్పటికీ అక్కడి ఓటర్లపై ఆయన ప్రభావం బలంగా ఉంది. అందువల్ల ఈ విగ్రహావిష్కరణ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీగా కలిసివస్తుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాతి ఉపఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార కాంగ్రెస్.. ఇప్పుడు హైదరాబాద్ ప్రాంతంలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లపై కన్నేసింది.

గత 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 స్థానాలకు గానూ.. బీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐదేళ్ల కౌన్సిల్ గడువు ముగియడంతో, కాంగ్రెస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విభజించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ గా ఉన్నాయి. ప్రస్తుతం వార్డుల పునర్విభజన, ఇతర పరిపాలనాపరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవి పూర్తి కాగానే ఈ మూడు కార్పొరేషన్లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో ఎలాగైనా హైదరాబాద్‌పై కాంగ్రెస్ జెండా ఎగరేయాలనే పట్టుదలతో సీఎం రేవంత్ రెడ్డి ఈ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.