Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో మహిళలకు రక్షణ ఏది.. అమిత్ షా

బెంగాల్‌లో మహిళలకు రక్షణ ఏది.. అమిత్ షా

Panthagani Anusha
22 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కేంద్ర గృహ మంత్రి అమిత్ షా తీవ్ర విమర్శలు చేశారు. మంగళవారం పశ్చిమ మిద్నాపూర్ జిల్లాలోని సల్బోనిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో చట్టవ్యవస్థ కుప్పకూలిందని, ఆడబిడ్డలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు

రాష్ట్రంలో వరుసగా చోటుచేసుకుంటున్న దారుణాలే ఇందుకు నిదర్శనమని షా పేర్కొన్నారు. సాందేశ్‌ఖాళిలో మహిళలపై జరిగిన లైంగిక వేధింపులు, ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటనలను ప్రస్తావిస్తూ మమత ప్రభుత్వంపై మండిపడ్డారు. దుర్గాపూర్ మెడికల్ కాలేజ్, దక్షిణ కోల్‌కతా లా కాలేజీ ఘటనలు రాష్ట్రంలోని దారుణ పరిస్థితులకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వస్తే మహిళలపై అకృత్యాలకు పాల్పడే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోమని దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇక వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అమిత్ షా వరాల జల్లు కురిపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మహిళలకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ. 3,000 భృతితో పాటు సొంతంగా పరిశ్రమలు స్థాపించే వారికి రూ. 10 లక్షల వరకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని ప్రకటించారు. గర్భిణీలకు రూ. 21,000 ఆర్థిక సాయం, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు నెలకు రూ.2,000 చొప్పున పెన్షన్ అందజేస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని వెల్లడించారు.

ప్రభుత్వ ఉద్యోగులను ఆకట్టుకునేలా అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే డీఏ బకాయిలను చెల్లిస్తామని 7వ వేతన సంఘం ప్రయోజనాలను సకాలంలో అమలు చేస్తామని షా హామీ ఇచ్చారు. అదేవిదంగా రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్ర సమరయోధుడు ఖుదీరామ్ బోస్ చరిత్రను పాఠ్యపుస్తకాల్లో తప్పుగా చూపిస్తోందని బెంగాల్ సంస్కృతిని అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు కేవలం అధికార మార్పిడి కోసం కాదని చొరబాటుదారుల నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసేందుకని ఆయన పిలుపునిచ్చారు. కాగా 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా మే 4న ఫలితాలు విడుదల కానున్నాయి.