
సీఎం రేవంత్ రెడ్డి అసలు రాష్ట్రానికి ఏం చేశారు?: ఎన్. రామచందర్ రావు
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై రాజకీయ విమర్శలు మరోసారి వేడెక్కాయి. తెలంగాణలో రెండున్నరేళ్లలో కాంగ్రెస్ పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అటు ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా తప్పుపట్టగా, ఇటు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కూడా అంతే ధీటుగా బదులిచ్చారు. సోమవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. గత రెండున్నరేళ్లలో విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కొన్నేళ్లలో రాష్ట్రానికి ఏం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించలేని దుస్థితి నెలకొంది. రిటైర్డ్ ఉద్యోగులు తమ పదవీ విరమణ ప్రయోజనాల కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రజల హక్కులను కాపాడటంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు.
అసెంబ్లీ వేదికగా చర్చకు సిద్ధం: ముఖ్యమంత్రి
మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన, కేంద్రంలో గడిచిన 12 ఏళ్ల బీజేపీ వైఖరి, తెలంగాణలో రెండున్నరేళ్ల కాంగ్రెస్ ప్రగతిపై అసెంబ్లీ, మండలి ప్రత్యేక వేదికలుగా బహిరంగ చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. మూడు పార్టీల మేనిఫెస్టోల అమలుపై అసెంబ్లీలోనే తేల్చుకుందామని, ఇందుకోసం ప్రతిపక్షాలు స్పీకర్, కౌన్సిల్ చైర్మన్‌లకు లేఖలు రాయాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వ రికార్డు స్థాయి విజయాలను వివరిస్తూ, పేదల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించామని తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ వంటి వివిధ కార్యక్రమాల ద్వారా రైతుల కోసం రూ. 1.56 లక్షల కోట్లు ఖర్చు చేశామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు రాకపోయినా, రైతుల శ్రమతో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి పండించి, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచామన్నారు. కేంద్రానికి పదేపదే విజ్ఞప్తి చేసినా యూరియా సరఫరాలో నిర్లక్ష్యం వహించినా.. తాము రికార్డు స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని స్పష్టం చేశారు.
రేషన్ కార్డుల పంపిణీ
ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానని, దానికి అడ్డుపడే వారిని మూసీ నదిలోనే పాతర వేస్తామని సీఎం హెచ్చరించారు. గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేస్తూ.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. బీఆర్ఎస్ మొదటి ఐదేళ్ల పాలనలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వని విషయాన్ని మహిళలు మర్చిపోలేదన్నారు.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వకుండా, పేదలకు పశువుల మేతకు వాడే నాసిరకం బియ్యాన్ని సరఫరా చేసిందని ఆరోపించారు. కానీ, తమ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లక్షలాది రేషన్ కార్డులు జారీ చేయడమే కాకుండా.. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో, కేటీఆర్ జన్వాడలో తినే అచ్చమైన సన్నబియ్యాన్ని (వ్యక్తికి 6 కిలోల చొప్పున) 3.28 కోట్ల మంది పేదలకు ఏటా రూ. 16,000 కోట్ల వ్యయంతో ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రూ. 13,000 కోట్ల అంచనా వ్యయంతో 6,300 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారుల విస్తరణకు శంకుస్థాపన చేశామని తెలిపిన సీఎం.. నల్గొండ జిల్లా వేదికగాబీఆర్ఎస్‌కు ఇక రాజకీయ భవిష్యత్తు లేదని, ప్రజలు ఆ పార్టీని ఇప్పటికే తిరస్కరించారని వ్యాఖ్యానించారు.
