Let's talk: editor@tmv.in
ఎన్నికల సమయంలో ఈ పొదుపు మంత్రం ఏమైంది?: ఎంపీ అసదుద్దీన్

ఎన్నికల సమయంలో ఈ పొదుపు మంత్రం ఏమైంది?: ఎంపీ అసదుద్దీన్

Gaddamidi Naveen
13 మే, 2026

దేశ ఆర్థిక భద్రత కోసం ప్రజలు బంగారం, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన విజ్ఞప్తిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో విదేశీ మారక నిల్వలు కాపాడాల్సిన అవసరం గురించి ప్రధాని, బీజేపీ ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తయ్యాకే ప్రజలకు ఇంధన ధరల భారం మోపేందుకు కేంద్రం సిద్ధమవుతోందని ఆరోపించారు.

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఓవైసీ, ఎన్నికల సమయంలో ప్రజల వద్ద ఓట్లు అడిగిన ప్రధాని, అప్పుడే పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన ధరలు పెరగబోతున్నాయని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. ఇప్పుడు మాత్రం కష్టాలను భరించేవారే నిజమైన దేశభక్తులని చెప్పడం సరైంది కాదన్నారు. త్వరలోనే దేశ ప్రజలకు పెట్రో ధరల పెంపు రూపంలో ఒక భారీ "ఇన్వాయిస్" అందబోతోందని ఆయన హెచ్చరించారు.

ట్రంప్ కోసమే ఈ డాలర్ల పొదుపు!

ప్రధాని మోడీ పొదుపు మంత్రం వెనుక అసలు ఉద్దేశ్యం అమెరికా ప్రయోజనాలేనని ఓవైసీ సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా నుంచి చమురు కొనాలని ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. ఆ చమురు కొనడానికి అవసరమైన డాలర్లను సేకరించడమే ప్రధాని అసలు లక్ష్యం. అందుకే ప్రజలను బంగారం కొనవద్దని, విదేశీ ప్రయాణాలు చేయవద్దని కోరుతున్నారని ఆయన ఆరోపించారు. ఇక్కడ డాలర్లు పొదుపు చేసి, హ్యూస్టన్‌లో ట్రంప్‌కు ఇవ్వడమే ప్రధాని ఉద్దేశ్యమని, ఇది దేశభక్తి ఎలా అవుతుందో ప్రజలే ఆలోచించాలని ఆయన అన్నారు. మొత్తానికి, విదేశీ మారక ద్రవ్య నిల్వల రక్షణ పేరిట ప్రధాని చేసిన విజ్ఞప్తులు ఇప్పుడు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీశాయి.