Let's talk: editor@tmv.in
పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:హోం మంత్రి అనిత

పోలీసుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం:హోం మంత్రి అనిత

Panthagani Anusha
23 మే, 2026

రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖపట్నం పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు, వారి కుటుంబ సభ్యులకు హెల్త్ ఇన్సూరెన్స్ (ఆరోగ్య బీమా) పాలసీ పత్రాలను ఆమె పంపిణీ చేశారు. విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా సంక్షేమ కార్యక్రమంలో మొత్తం 975 మంది హోంగార్డుల కుటుంబాలకు ఉచిత ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించారు.

ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న హోంగార్డుల ఆరోగ్య భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని వెల్లడించారు. ప్రస్తుత రోజుల్లో వైద్య చికిత్సలు సామాన్యుడికి భారంగా మారాయని ఇలాంటి తరుణంలో ఈ కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్ వారి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి భరోసా పత్రాలు అందుకుంటున్న హోంగార్డుల ముఖాల్లోని ఆనందం భద్రతా భావన తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

పోలీసులు సంక్షేమాన్ని కేవలం ఆరోగ్యానికే పరిమితం చేయకుండా మరిన్ని రకాలుగా విస్తరిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. పోలీస్ సిబ్బంది పిల్లలకు దేశంలోనే అత్యుత్తమ, నాణ్యమైన విద్యా అవకాశాలు కల్పించేలా ఒక ప్రత్యేక విద్యా కార్యక్రమంపై ఇప్పటికే ఉన్నతాధికారులతో చర్చలు జరిపినట్లు ఆమె వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ప్రణాళికను త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు హోం మంత్రి హామీ ఇచ్చారు.

మరోవైపు గత ప్రభుత్వాల కాలంలో అరకొరగా కేవలం ఒకే ఒక్క ఆరోగ్య భద్రతా పథకం ఉండేదని అది కూడా క్షేత్రస్థాయిలో అందరికీ అందుబాటులో లేకుండా పోయిందని మంత్రి విమర్శించారు. దానికి భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం సరికొత్త ‘హైబ్రిడ్ మోడల్’ విధానాన్ని తీసుకువచ్చిందని దీని ద్వారా పోలీస్ శాఖలోని ప్రతి ఒక్క ఉద్యోగికీ పూర్తిస్థాయి ఆరోగ్య బీమా సదుపాయం అందుతుందని స్పష్టం చేశారు. సమాజ రక్షణలో హోంగార్డుల సేవలను వినియోగించుకోవడమే కాకుండా వారి కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ భారీ సంక్షేమ కార్యక్రమాన్ని విజయవంతంగా రూపకల్పన చేసిన సిటీ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీతో పాటు డిసిపిలు, ఏసీపీలు, ఇతర పోలీస్ బృందాన్ని హోం మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.