Let's talk: editor@tmv.in
సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 294 మందిపై కేసులు

సైబరాబాద్‌లో వీకెండ్ డ్రంక్ అండ్ డ్రైవ్.. 294 మందిపై కేసులు

Gaddamidi Naveen
25 మే, 2026

వీకెండ్‌ను పురస్కరించుకుని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (సీటీపీ) నగరవ్యాప్తంగా నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో రికార్డు స్థాయిలో 294 మంది మద్యం బాబులు పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో 255 మంది ద్విచక్ర వాహనదారులు, 34 మంది కార్ల డ్రైవర్లు, ఐదుగురు ఆటో డ్రైవర్లు ఉన్నారు.

బ్రెత్ అనలైజర్ పరీక్షల ఆధారంగా రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు ఇలా నమోదయ్యాయి. 36 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 200 ఎంజీ/100 ఎంఎల్ మధ్య 244 మంది, 201 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 300 ఎంజీ/100 ఎంఎల్ మధ్య 30 మంది, 301 ఎంజీ/100 ఎంఎల్ నుంచి 550 ఎంజీ/100 ఎంఎల్ మధ్య 20 మంది ఉన్నారని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

పట్టుబడిన అందరినీ న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నట్లు ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ-1 జి. హన్మంత రావు తెలిపారు. మద్యం మత్తులో వాహనం నడిపి ప్రాణాంతక ప్రమాదాలకు కారణమైతే, వారిపై భారతీయ న్యాయ సంహిత, 2023 లోని సెక్షన్ 105 కింద కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ సెక్షన్ కింద గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధిస్తారు. కాగా, గత వారంలో (18.05.2026 నుంచి 23.05.2026 వరకు) కోర్టులు 156 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను పరిష్కరించాయి. ఇందులో 10 మందికి జైలు శిక్షతో పాటు జరిమానా, ఒకరికి జరిమానాతో పాటు సామాజిక సేవ, 145 మందికి కేవలం జరిమానా విధించినట్లు అధికారులు స్పష్టం చేశారు.