Let's talk: editor@tmv.in
బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేస్తాం: ఎం.కె. స్టాలిన్

బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేస్తాం: ఎం.కె. స్టాలిన్

Panthagani Anusha
10 మే, 2026

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్‌ను సొంతం చేసుకుంది. అసెంబ్లీలో 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ మెజారిటీ మార్కు (118)కు కొద్ది దూరంలో నిలిచిన టీవీకేకు మిత్రపక్షాలు అండగా నిలవడంతో మార్గం సుగమమైంది.

ఈ రాజకీయ పరిణామాలపై డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ శనివారం ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీ తీరును తీవ్రంగా తప్పుబట్టారు. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లో భాగస్వామిగా ఉండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కనీసం మర్యాదపూర్వకమైన భేటీకి కూడా డీఎంకే కార్యాలయం ‘అన్నా అరీవాళయం’కు రాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ తమతో సంబంధాలను తెంచుకుందని ఇది ఒకరకమైన రాజకీయ విశ్వాసఘాతుకమని ఆయన వ్యాఖ్యానించారు.

మరోవైపు డీఎంకే కూటమిలో ఉన్న ఎడమపక్షాలు (సీపీఐ, సీపీఎం) విడుతలై చిరుతైగల్ కట్చి మాత్రం విభిన్నమైన వైఖరిని ప్రదర్శించాయి. టీవీకేకు మద్దతు ఇస్తూనే డీఎంకే విధానాలకు తమ మద్దతు కొనసాగుతుందని ఆ పార్టీల నేతలు ప్రకటించడాన్ని స్టాలిన్ స్వాగతించారు. ప్రజా హక్కుల కోసం భవిష్యత్తులోనూ కలిసి పోరాడుతామని చెప్పిన సీపీఐ నాయకులు షణ్ముగం, వీరపాండియన్ వీసీకే అధ్యక్షుడు థోల్. తిరుమావళవన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు వచ్చి ప్రజలపై భారం పడకూడదనే ఉద్దేశంతోనే మిత్రపక్షాల నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు స్టాలిన్ స్పష్టం చేశారు. మేము కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు కల్పించము. శాసనసభలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా పనిచేస్తాము. గత ఐదేళ్లలో మా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొత్త ప్రభుత్వం కొనసాగించాలని కోరుకుంటున్నాము"అని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకేకు కాంగ్రెస్ (5), సీపీఐ (2), సీపీఎం (2), వీసీకే (2) ఐయూఎంఎల్ (2) ఎమ్మెల్యేల మద్దతు లభించింది. దీంతో టీవీకే కూటమి బలం 121కు చేరింది. అయితే విజయ్ రెండు చోట్ల విజయం సాధించినందున ఒక స్థానానికి రాజీనామా చేయనున్నారు. అప్పుడు సభ బలం 233కి తగ్గగా టీవీకే బలం 118కి చేరుకుంటుంది. దీంతో విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అవసరమైన మెజారిటీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేస్తాం: ఎం.కె. స్టాలిన్ - Tholi Paluku