Let's talk: editor@tmv.in
తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా మారుస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా మారుస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుందని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. పర్యాటక రంగానికి కొత్త ఉత్సాహం తీసుకురావాలంటే మౌలిక వసతుల అభివృద్ధి, గమ్యస్థానాల సమర్థమైన బ్రాండింగ్, విస్తృత ప్రచారం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు నిర్దిష్ట కాలపరిమితితో కూడిన సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

మంగ‌ళ‌వారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో నిర్వహించిన పర్యాటక సలహా కమిటీ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలోని వారసత్వ సంపద, సంస్కృతి, చారిత్రక కట్టడాలు, ప్రకృతి సౌందర్యం, జల వనరులు, అటవీ ప్రాంతాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలను సమన్వయం చేస్తూ తెలంగాణను శక్తివంతమైన పర్యాటక హబ్‌గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. సోమశిల, రామప్ప, యాదాద్రి, గోల్కొండ, తారామతి బరాదరి, నాగార్జున సాగర్ వంటి ప్రధాన కేంద్రాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేస్తూ, పర్యాటకులను ఆకర్షించేందుకు క్రమం తప్పకుండా వారాంతపు సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని మంత్రి పేర్కొన్నారు.

పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని మంత్రి హెచ్చరించారు. ముఖ్యంగా మరుగుదొడ్లు, తాత్కాలిక వసతి గదులు, టెంట్లు, గ్లాస్ హౌస్‌లు, రహదారి పక్కన విశ్రాంతి కేంద్రాల ఏర్పాటు, అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే కమిటీ సమావేశంలో వచ్చిన ప్రతిపాదనల అమలును నిరంతరం సమీక్షిస్తూ, ప్రతి ప్రాజెక్టుకు నోడల్ అధికారిని నియమించి జాప్యం లేకుండా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు నవంబరు లేదా డిసెంబరు నెలల్లో హైదరాబాద్‌లో భారీ కార్నివాల్ నిర్వహణపై అధ్యయనం చేయాలని, త్వరితగతిన ప్రతిపాదనలు సమర్పించాలని మంత్రి కోరారు. ప్రారంభ దశలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించినా, భవిష్యత్తులో ప్రైవేటు భాగస్వామ్యంతో స్వయం సమృద్ధిగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా జీహెచ్ఎంసీ, హెచ్ఏండీఏల సమన్వయంతో నగర సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, శిల్పాలు, ల్యాండ్‌స్కేపింగ్‌, స్కైవాక్‌లు వంటి అంశాలను సృజనాత్మకంగా అభివృద్ధి చేయాలని మంత్రి అన్నారు. సమావేశంలో పర్యాటక అభివృద్ధి సంస్థ అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.