Let's talk: editor@tmv.in
హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ను గ్లోబల్ హెల్త్ హబ్‌గా మారుస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
28 ఏప్రిల్, 2026

నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అపోలో హాస్పిటల్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన “ది హాస్పిటల్ ఆఫ్ గ్రాటిట్యూడ్” ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ మంత్రి దామోద‌ర్ రాజనర్సింహ, అపోలో గ్రూప్ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 46 ఏళ్ల క్రితం చెన్నైలో చిన్నగా మొదలైన అపోలో హాస్పిటల్స్ ప్రయాణం, నేడు దేశ ఆరోగ్య రంగంలోనే ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని కొనియాడారు. డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి భారతదేశంలో ఆధునిక వైద్య మౌలిక సదుపాయాల కల్పనలో మార్గదర్శక పాత్ర పోషించారని, 'అపోలో' అనే బ్రాండ్ కోట్లాది మందికి నమ్మకానికి నిదర్శనంగా మారిందని ప్రశంసించారు.

హైదరాబాద్‌ను అంతర్జాతీయ మెడికల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం అన్నారు. ఇందుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. మధ్యప్రాచ్యం దేశాల నుంచి చికిత్స కోసం వచ్చే రోగుల సౌకర్యార్థం హైదరాబాద్‌కు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న 'ఫోర్త్ సిటీ'లో అంతర్జాతీయ స్థాయి హెల్త్ సీటీని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు. విమానాశ్రయం నుంచి ఆసుపత్రులకు రోగులను వేగంగా తరలించేందుకు ఎయిర్‌పోర్ట్ అధికారులతో చర్చించి 'గ్రీన్ ఛానల్' వ్యవస్థను ప్రవేశపెడతామన్నారు.

ఫార్మా రాజధానిగా నగరం

1967లో ఇందిరాగాంధీ ఐడీపీఎల్ ఏర్పాటు చేయడంతో ప్రారంభమైన ప్రస్థానం, నేడు హైదరాబాద్‌ను ప్రపంచ ఫార్మా హబ్‌గా నిలిపిందని గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా అవసరమైన కోవిడ్ వ్యాక్సిన్లు హైదరాబాద్ నుండే సరఫరా అయ్యాయని, దేశంలోని 40 శాతం బల్క్ డ్రగ్స్ ఇక్కడే తయారవుతున్నాయని సీఎం గుర్తుచేశారు. వైద్య రంగంలో పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనువైన ప్రాంతమని, పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి భద్రత మరియు సహకారాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న మంత్రి దామోదర్ రాజనర్సింహను సీఎం ఈ సందర్భంగా "సోషల్ డాక్టర్"గా అభివర్ణించారు.