Let's talk: editor@tmv.in
మత్స్యకారులకు అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

మత్స్యకారులకు అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

Panthagani Anusha
10 మే, 2026

శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలోని మత్స్యకార గ్రామాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పునరుద్ఘాటించారు. తీరప్రాంత అభివృద్ధిలో భాగంగా చేపట్టిన ‘మత్స్య సాగరమాల’ కార్యక్రమం ద్వారా మత్స్యకారుల చిరకాల స్వప్నాలను నెరవేరుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ పథకం కింద గ్రామీణ రహదారుల నిర్మాణంతో పాటు కోల్ ఇండియా సి.ఎస్.ఆర్ నిధులతో తీరం పొడవునా విద్యుదీకరణ పనులు పూర్తి చేసినట్లు వెల్లడించారు.

మత్స్యకారులు వేట కోసం అర్ధరాత్రి సమయాల్లో కటిక చీకటిలో సముద్ర తీరానికి వెళ్లే క్రమంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సుమారు 1594 సోలార్ లైట్లను ఏర్పాటు చేయడం ద్వారా చీకటి కష్టాలను దూరం చేశామన్నారు. "అర్ధరాత్రి వేళ తీరానికి వెళ్లే మత్స్యకారుల అడుగులకు వెలుగుల తోడు ఇవ్వాలనే లక్ష్యంతోనే ఈ ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేశాం" అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

ఈ సోలార్ వెలుగుల వల్ల కేవలం మత్స్యకారులకు వెసులుబాటు కలగడమే కాకుండా తీరప్రాంతంలో భద్రత కూడా పెరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందే అవకాశం ఉందని ఇది స్థానికులకు మరిన్ని ఉపాధి అవకాశాలను తెచ్చిపెడుతుందని పేర్కొన్నారు.

మత్స్యకార సోదరుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకార గ్రామాల్లో రహదారులు, విద్యుత్ వంటి సౌకర్యాలను కల్పించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలతో శ్రీకాకుళం తీరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

మత్స్యకారులకు అండగా ఉంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు - Tholi Paluku