Let's talk: editor@tmv.in
జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎంపీ ఈటల రాజేందర్
జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎంపీ ఈటల రాజేందర్

జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: ఎంపీ ఈటల రాజేందర్

Gaddamidi Naveen
23 మే, 2026

జవహర్‌నగర్ డంప్‌యార్డ్ సమస్యపై రాజకీయాలకు అతీతంగా శాశ్వత పరిష్కారం కనుగొనేందుకు నిరంతరం ప్రయత్నిస్తానని మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. అఖిలపక్ష నాయకులు, ప్రభుత్వ అధికారులు, రాంకీ సంస్థ ప్రతినిధులతో కలిసి ఆయన జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌లో క్షేత్రస్థాయి పరిశీలన చేసి, అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఒకే చోట పదివేల మెట్రిక్ టన్నుల చెత్త జమ కావడం అత్యంత ఆందోళనకరమని అన్నారు. ఈ చెత్తను రీసైకిల్ చేస్తామని ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రాంకీ సంస్థ, ఆ నిబంధనలను అస్సలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. 'జీరో డిస్చార్జ్' నిబంధనలను తుంగలో తొక్కడం వల్ల జవహర్‌నగర్ చుట్టుపక్కల 40 కిలోమీటర్ల పరిధిలోని చెరువులు నాశనమయ్యాయని, భూగర్భ జలాలు పూర్తిగా విషతుల్యంగా మారాయని ఆరోపించారు.

డంప్‌యార్డ్ నుంచి వస్తున్న గాలి, నీరు, ధ్వని కాలుష్యం కారణంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యం గాలిలో కలిసిపోయిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం తీవ్రత వల్ల గర్భిణీ స్త్రీలకు అబార్షన్లు అవుతున్నాయని, పశుసంపద మరణిస్తోందని, వాతావరణ సమతుల్యత దెబ్బతిని మనిషి నివసించలేని ప్రాంతంగా ఇది మారిపోయిందని ధ్వజమెత్తారు. స్థానిక జేఏసీలు పోరాటం చేస్తున్నప్పటికీ, రాంకీ సంస్థ పెద్ద లాయర్లను పెట్టుకుని తప్పుడు నివేదికలతో తప్పించుకుంటోందని విమర్శించారు. ప్రతిరోజూ వచ్చే చెత్తలో సగం కూడా రీసైకిల్ చేయడం లేదన్నారు.

ముఖ్యమంత్రితో భేటీ - మూడు రోజుల్లో నివేదిక

ఈ తీవ్రమైన సమస్యపై తాను ఇప్పటికే ముఖ్యమంత్రిని కలిశానని ఎంపీ తెలిపారు. మీరు గతంలో ఈ ప్రాంత ఎంపీగా పనిచేశారు, మీకు సమస్యపై అవగాహన ఉంది, ఇప్పుడు సమస్యను తీర్చే స్థానంలో ఉన్నారు.. ఇక్కడి ప్రజలకు డంప్‌యార్డ్ నుంచి విముక్తి ఉందా లేదా? అని తాను సీఎంను ప్రశ్నించినట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి, రాంకీ ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించామని.. దీనిపై మూడు రోజుల్లో సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. రిపోర్ట్ అందిన వెంటనే ముఖ్యమంత్రితో మరోసారి భేటీ అవుతామన్నారు. నగరం మొత్తం చెత్తను ఒకే చోట వేయకుండా, పది వేర్వేరు ప్రాంతాల్లో వేయడం ద్వారా కాలుష్యం లేకుండా చేసే టెక్నాలజీని పరిశీలిస్తున్నామన్నారు. జవహర్‌నగర్ డంప్‌యార్డ్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఎన్నో ఏళ్లుగా పోరాడుతోందని, ఈ సమస్య పరిష్కారానికి అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.