Let's talk: editor@tmv.in
రథయాత్రలో ‘కార్డన్ పాసులు’ తగ్గిస్తాం: ఒడిశా ప్రభుత్వం

రథయాత్రలో ‘కార్డన్ పాసులు’ తగ్గిస్తాం: ఒడిశా ప్రభుత్వం

Pinjari Chand
27 ఏప్రిల్, 2026

రథయాత్ర సందర్భంగా భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఒడిశా ప్రభుత్వం ఈ ఏడాది కీలక నిర్ణయం తీసుకుంది. రథాల సమీపంలో అధిక జనసందోహం ఏర్పడకుండా ఉండేందుకు ‘కార్డన్ పాసులు’ సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. గత ఏడాది పూరిలో జరిగిన రథయాత్ర సమయంలో ముగ్గురు భక్తులు మరణించిన ఘటన నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ముఖ్య కార్యదర్శి అనూ గార్గ్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్డన్ పాసులు అనేవి జగన్నాథ్‌, బలభద్ర, సుభద్ర రథాల చుట్టూ ఏర్పాటు చేసే అంతర్గత భద్రతా వలయంలోకి ప్రవేశించేందుకు జారీ చేస్తారు. ఇవి సాధారణంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొనే వారు, భద్రతా సిబ్బందికి మాత్రమే ఇస్తారు.

ఈసారి జూలై 16 నుంచి ప్రారంభమయ్యే రథయాత్రకు లక్షలాది మంది భక్తులు పూరికి చేరుకునే అవకాశముండటంతో భద్రత, రద్దీ నియంత్రణ, ఆరోగ్య సేవలు, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ నిర్వహణ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రధానంగా ‘బడా దండా’ (గ్రాండ్ రోడ్)పై రథాలను లాగే సమయంలో భారీగా జనసందోహం ఏర్పడుతుందని భావించి ‘పహండి’ ఊరేగింపును సజావుగా నిర్వహించే మార్గాలపై చర్చించారు. అలాగే రహదారిపై ఉచిత అన్నదానాలు నిర్వహించడం వల్ల ఏర్పడుతున్న చెత్త సమస్యను దృష్టిలో ఉంచుకుని, అటువంటి కార్యక్రమాలను నియంత్రించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రత్యేక ప్రదేశాలను కేటాయించనున్నారు.

వేగంగా మౌలిక సదుపాయాల కల్పన

ఇక భద్రతా చర్యలలో భాగంగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు, అత్యవసర పర్యవేక్షణ కేంద్రాలు, రోడ్ల మరమ్మతులు, పార్కింగ్ సౌకర్యాలు, తగిన పోలీసు బలగాల నియామకం వంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ అదనంగా ఎనిమిది టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయనుంది. ఇదిలా ఉండగా, రథాల నిర్మాణ పనులు అక్షయ తృతీయ రోజు (ఏప్రిల్ 20) నుంచి ప్రారంభమై ప్రస్తుతం ఆరో రోజు కొనసాగుతున్నాయి. అవసరమైన 865 దుంపల్లో ఇప్పటికే 576 సేకరించినట్లు శ్రీ జగన్నాథ్‌ టెంపుల్‌ పాలన యంత్రాంగం తెలిపింది.

భక్తుల సౌకర్యం కోసం పూరి నగరంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు పూర్తి దశలో ఉన్నాయి. జగన్నాథ్ బల్లవ్ యాత్రికుల కేంద్రం, మల్టీ లెవెల్ పార్కింగ్, ఆచార్య హరిహర్ చౌక్ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే గుండిచా ఆలయ పునరుద్ధరణ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయి. పర్యావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగరంలో సుమారు 1,600 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. భారీ వర్షాల సమయంలో నీరు నిల్వ కాకుండా ఉండేందుకు 23 ప్రాంతాల్లో హై కెపాసిటీ పంపులను సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్య సేవల కోసం నగరంలోని వివిధ ప్రాంతాల్లో 10 పడకలతో ఎనిమిది తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మొత్తంగా, ఈసారి రథయాత్రను భక్తులకు సురక్షితంగా, సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ఒడిశా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది.