
రైతులకు నాణ్యమైన విత్తనాలే అందిస్తాం: ఎమ్మెల్యే సురేంద్ర బాబు
ఖరీఫ్ 2026 సీజన్‌కు సంబంధించి రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు తెలిపారు. స్థానిక ప్రజావేదిక నందు నిర్వహించిన రాయితీ వేరుశెనగ, కంది, చిరుధాన్యాల విత్తన పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో మొదటిగా కళ్యాణదుర్గంలోనే విత్తన పంపిణీ ప్రారంభించినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేంద్ర బాబు మాట్లాడుతూ.. నియోజకవర్గంలో 5000 మంది రైతులు విత్తనాల కోసం నమోదు చేసుకోగా, ఇప్పటికే 2200 క్వింటాళ్ల వేరుశెనగ కాయలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపినందున, రైతులు కంది, సజ్జ, జొన్న, కొర్ర వంటి చిరుధాన్యాల సాగుపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు. జూన్ 20న దేశ ప్రధాని నరేంద్ర మోడీ కోల్‌కతాలో ‘పీఎమ్ కిసాన్’, ‘అన్నదాత సుఖీభవ’ పథకాలను ప్రారంభించి నేరుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని వెల్లడించారు. త్వరలోనే రైతులకు ట్రాక్టర్లు, డ్రిప్, స్ప్రింక్లర్ పరికరాలు కూడా అందిస్తామన్నారు.
జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చొరవతో హార్టికల్చర్ నిధుల ద్వారా అత్యంత ప్రాధాన్యత ఉన్న జాబితాలో చేర్చిన భైరవానితిప్ప ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేస్తామని ప్రకటించారు. అలాగే కుందుర్పి మండలం జంబగుంపుల వద్ద సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ‘ఏపీఏఐఎంఎస్ 2.0’ యాప్ ద్వారా యూరియా, డీఏపీ ఎరువుల సరైన వాడకంపై రైతులకు అవగాహన కల్పించి, అవసరమైన మేరకు ఎరువులు అందజేస్తామని తెలిపారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్ రైతులకు అందాల్సిన వ్యవసాయ మోటార్లను కూడా అమ్ముకున్నారని, ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం పాలనను గాడిలో పెడుతోందని ఎమ్మెల్యే విమర్శించారు.
