Let's talk: editor@tmv.in
జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

జూన్‌లో సనత్‌నగర్ టిమ్స్‌ను ప్రారంభిస్తాం: మంత్రి దామోదర్ రాజనర్సింహ

Gaddamidi Naveen
13 మే, 2026

రాష్ట్రంలో నిరుపేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా నిర్మిస్తున్న సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ను జూన్ నెలలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. మంగళవారం ఆయన ఆసుపత్రిలో జరుగుతున్న వైద్య సేవల ట్రయల్ రన్‌ను స్వయంగా పరిశీలించారు.

మంత్రి ఆసుపత్రిలోని ఏ, బి, సి బ్లాకులను, ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ వార్డులు, ఎమర్జెన్సీ డిపార్ట్‌మెంట్, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ ల్యాబ్ లతో పాటు కిచెన్, మెకనైజ్‌డ్ లాండ్రీ వంటి విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి 24 గంటల విద్యుత్, నీటి సరఫరా ఉండాలని, ఫైర్ సేఫ్టీ విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులను మంత్రి ఆదేశించారు. రోగుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఫార్మసీ కౌంటర్ల సంఖ్యను పెంచాలని సూచించారు. అడ్వాన్స్‌డ్ ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్ వంటి యంత్రాలు పూర్తిస్థాయిలో రోగులకు అందుబాటులోకి రావాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, సిబ్బందిని సిద్ధం చేయాలని ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి, సనత్‌నగర్ టిమ్స్ యొక్క విశిష్టతను వివరించారు. ప్రస్తుతం విజయవంతంగా ట్రయల్ రన్ కొనసాగుతోందని, కొన్ని ఫినిషింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. 1000 పడకల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ఆసుపత్రిలో 300 ఎమర్జెన్సీ బెడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గుండె సంబంధిత వ్యాధులు, అవయవ మార్పిడి శస్త్రచికిత్సలకు ఈ ఆసుపత్రి ఒక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'గా నిలుస్తుందని, ఇక్కడే ఒక అద్భుతమైన మెడికల్ రీసెర్చ్ సెంటర్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. పెండింగ్ పనులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆర్‌ అండ్ బీ, ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు నిలిపే గొప్ప వేదికగా టిమ్స్ నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.