Let's talk: editor@tmv.in
అసైన్డ్ భూములు లాక్కుంటే ఊరుకోం: కేటీఆర్

అసైన్డ్ భూములు లాక్కుంటే ఊరుకోం: కేటీఆర్

Gaddamidi Naveen
27 జూన్, 2026

ఎన్నికల ముందు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక పారిశ్రామిక వాడల పేరుతో దళిత, గిరిజన పేదల భూములను కాంగ్రెస్ సర్కార్ బలవంతంగా లాక్కుంటోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. పరిగి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, ఎస్‌ఐఆర్‌ శిక్షణా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పరిగిలో స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా భూములను స్వాధీనం చేసుకుంటోందని ఆరోపించారు. లగచర్ల ఘటనను ప్రజలు ఎప్పటికీ మర్చిపోవద్దని పిలుపునిచ్చారు. ఫార్మా విలేజ్/పరిశ్రమల కోసం భూములు ఇవ్వనందుకే స్థానిక రైతులపై పోలీసులు కేసులు పెట్టించి, దాడులు చేయించారని ధ్వజమెత్తారు. గిరిజన యువకులను అక్రమంగా జైలుకు పంపడమే కాకుండా, వారు అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కూడా ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని కేటీఆర్ ఆరోపించారు. అంబేద్కర్ అభయహస్తం పథకం కింద రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని విమర్శించారు. అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ప్రస్తుతం పరిగిలో అదే భూములను స్వాధీనం చేసుకుంటోందని అన్నారు. అలాగే రూ.4,400 కోట్ల కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 72 శాతం కాంట్రాక్టులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ, ఆ హామీని అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు.

పరిగి నియోజకవర్గంలో పేదల అసైన్డ్ భూములను లాక్కోవడాన్ని బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మొదట రైతులకు పట్టాలు ఇవ్వాలి. ఆపై తగిన నష్టపరిహారం చెల్లించి, వారి పూర్తి అంగీకారంతోనే భూములు సేకరించాలని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న ఈ భూముల అక్రమాలపై బాధిత రైతుల పక్షాన నిలబడి, అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ ఉమ్మడి పోరాటంలో భాగంగా కార్యకర్తలంతా క్షేత్రస్థాయిలో ప్రజలకు తోడుగా ఉండాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, డాక్టర్ మెతుకు ఆనంద్ ఇతర ముఖ్య బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
KTRBRSTelanganaCongressRevanthReddyAssignedLandsDalitRightsTribalRightsSCSTBCKodangalParigiTelanganaPoliticsPoliticalNews
అసైన్డ్ భూములు లాక్కుంటే ఊరుకోం: కేటీఆర్ - Tholi Paluku