

సింగరేణిపై రాబందుల కన్ను పడనివ్వం: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికుల కష్టాన్ని, వారి ఆత్మగౌరవాన్ని తక్కువ చేసి మాట్లాడే విపక్ష నేతలపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేవలం తమ రాజకీయ స్వార్థం కోసం సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
సింగరేణిపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారానికి గట్టి కౌంటర్ ఇచ్చేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆదివారం మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిని సందర్శించారు. ఈ సందర్భంగా గని పరిసరాలను, రక్షణ చర్యలను, రవాణా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన, ప్రజల ముందు నిజాలను ఉంచేందుకు ఈ బహిరంగ తనిఖీ నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడిన భట్టి విక్రమార్క, సింగరేణి కార్మికుల కష్టం, ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రయత్నాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం సింగరేణి ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రతిపక్ష నాయకులు అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాను రాజకీయ వ్యాఖ్యలు చేయడానికి రాలేదని, ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకురావడానికే వచ్చానని చెప్పారు.
సింగరేణి అభివృద్ధి, విజయాలు కార్మికుల చెమట చుక్కల ఫలితమని, వారి గౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. సంస్థ యాజమాన్యం నిబద్ధత, పారదర్శక విధానాలపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తెలంగాణకు సింగరేణి ఒక మణిహారమని, దాని ప్రతిష్ఠను దెబ్బతీయాలనే ప్రయత్నాలు రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్న లేఖల్లో వాస్తవాలకు విరుద్ధమైన అంశాలను ప్రస్తావిస్తున్నారని ఆరోపించిన భట్టి, ప్రజలకు నిజాలు తెలియజేయడమే బహిరంగ తనిఖీ లక్ష్యమని వివరించారు. తెలంగాణ భవిష్యత్తు, సింగరేణిని రాజకీయ స్వార్థాలకు వాడుకోవద్దని రాజకీయ పార్టీలకు సూచించారు.
సింగరేణి కేవలం ఒక సంస్థ కాదని, తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. సంస్థ వనరులు, వ్యవస్థలు, బలం అన్నీ ప్రజలవేనని, దోపిడీదారులు లేదా అవకాశవాదులు సింగరేణిపై కన్నేస్తే ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తుందని చెప్పారు. సంస్థలో సంపూర్ణ పారదర్శకత కొనసాగుతుందని భరోసా ఇచ్చారు.
తనిఖీలో భాగంగా బొగ్గు ఉత్పత్తి, నిల్వలు, రవాణా ప్రక్రియలు, భద్రతా చర్యలు, గని పరిసరాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్ట్ గనిలో మరో 28 సంవత్సరాల పాటు బొగ్గు ఉత్పత్తి కొనసాగించేందుకు సరిపడా నిల్వలు ఉన్నాయని అధికారులు వివరించారు. దేశంలోనే తొలిసారిగా సింగరేణి కార్మికులకు రూ. 1.25 కోట్ల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్నాము. సింగరేణి కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, వారికి ప్రపంచస్థాయి వైద్య సదుపాయాలు, వారి పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాల విద్య అందించేందుకు కృషి చేస్తున్నామని భట్టి విక్రమార్క తెలిపారు.
