
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చనివ్వం: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్ అంశంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. నాలుగు జిల్లాల చెత్తను హుజురాబాద్‌కు తరలించి అక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ నిర్ణయం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే చర్యగా పేర్కొంటూ, వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి తీవ్రంగా కాలుష్యానికి గురవుతాయని, దీని ప్రభావంతో ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని కౌశిక్ రెడ్డి అన్నారు. వ్యవసాయం నాశనం అవుతుందని, తాగునీరు కలుషితం కావడంతో పాటు అనారోగ్య సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం బాధాకరమని ఆయన విమర్శించారు.
ఈ అంశంపై తాను రాజీ పడనని స్పష్టం చేసిన నేపథ్యంలో తనపై తప్పుడు కేసులు పెట్టి, సీబీసీఐడీ కేసులతో జైలుకు పంపిస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం, హక్కుల కోసం పోరాటం ఆపబోనని, ఎన్ని ఒత్తిడులు వచ్చినా వెనక్కి తగ్గనని అన్నారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యే వరకు నా పోరాటం కొనసాగుతుందని ఆయన ప్రకటించారు.
ఇదే సమయంలో ఈ అంశంపై స్పందించకపోవడంపై కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్‌లను ప్రశ్నించారు. ప్రజల సమస్యలపై మౌనం పాటించడం తగదని, ఇప్పటికైనా వారు ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలపై నకిలీ ప్రేమ చూపిస్తూ రాజకీయ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. హుజురాబాద్ ప్రజలు పెద్ద ఎత్తున ఒకే వేదికపైకి వచ్చి డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా గళం వినిపిస్తే ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిందేనని ఆయన అన్నారు. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ నెల 22న పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ పాదయాత్రను ప్రజా ఉద్యమంగా మార్చి మరింత ఉధృతంగా కొనసాగిస్తామని తెలిపారు. డంపింగ్ యార్డ్ ప్రతిపాదన పూర్తిగా రద్దు అయ్యే వరకు ఉద్యమం ఆగదని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
