Let's talk: editor@tmv.in
వెలిగొండ ప్రాజెక్టుకు నిర్వాసితుల త్యాగం మరువలేం: సీఎం చంద్రబాబు
వెలిగొండ ప్రాజెక్టుకు నిర్వాసితుల త్యాగం మరువలేం: సీఎం చంద్రబాబు

వెలిగొండ ప్రాజెక్టుకు నిర్వాసితుల త్యాగం మరువలేం: సీఎం చంద్రబాబు

Gaddamidi Naveen
28 జూన్, 2026

గంటవానిపల్లెలో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ కొరకు భూములు వదులుకున్న నిర్వాసితులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం రూ. 300 కోట్ల పునరావాస నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి విడుదల చేశారు. మార్కాపురం జిల్లా పరిధిలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. మొత్తం 2,351 నిర్వాసింత కుటుంబాలకు ఈ ఆర్థిక సాయం ద్వారా లబ్ధి చేకూరుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. కళానుతల, సుంకేసుల, చింతలముడిపి, కాటమరాజు తండా, సాయిరాం నగర్ తదితర ముంపు గ్రామాలకు చెందిన 2,351 నిర్వాసింత కుటుంబాల ఖాతాల్లోకి నేడే రూ. 300 కోట్ల ఆర్ అండ్ ఆర్ నిధులను జమ చేస్తున్నామ‌ని ప్రకటించారు. ప్రాజెక్ట్ కోసం సర్వస్వం కోల్పోయిన నిర్వాసితుల త్యాగం అమూల్యమైనదని, వారి త్యాగం వల్లే భవిష్యత్తులో సుమారు 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు, 23 లక్షల మందికి తాగునీరు అందుతుందని కొనియాడారు.

ప్రాజెక్టు తొలి దశ పనులు పూర్తి చేసి జూలై 31 నాటికి నీటిని విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చంద్రబాబు తెలిపారు. తొలి దశ ద్వారా 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు నాలుగు లక్షల మందికి తాగునీరు సరఫరా చేయనున్నట్లు చెప్పారు. రెండో దశ పూర్తయిన తర్వాత మరో 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు 11.2 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.

వెలిగొండ ప్రాజెక్టును ఒక చారిత్రాత్మక కట్టడంగా అభివర్ణించిన సీఎం చంద్రబాబు.. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈ ప్రాజెక్టుకు రూ. 10,580 కోట్లు అవసరమవుతాయని వివరించారు. ఇందులో ఇప్పటివరకు రూ. 6,736 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ. 3,844 కోట్లు వెచ్చించాల్సి ఉందన్నారు. 2024 లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిర్వాసితుల కోసం రూ. 759 కోట్లు ఖర్చు చేసిందని, మరో రూ. 905 కోట్లు మంజూరు చేసిందని.. అందులోని రూ. 300 కోట్లను శనివారం విడుదల చేశామని స్పష్టం చేశారు. ఇదే సమయంలో గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై సీఎం మండిపడుతూ.. నాటి ప్రభుత్వం అవలంబించిన విధానాల వల్లే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైందని, ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులకు వారే కారణమని ఆరోపించారు.

మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలకు వెలిగొండ ప్రాజెక్ట్ ఎంతో కీలకమైనది. ఈ నాలుగు జిల్లాల పరిధిలోని 30 మండలాల ప్రజలకు ఇది సాగు, తాగునీరు అందించడమే కాకుండా ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా వేధిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

‘సంజీవని’ హెల్త్ కార్డ్‌లు.. జులైలోనే ‘తల్లికి వందనం’

అనంతరం కేఎస్ పాలెంలో జరిగిన బహిరంగ సభలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రతి స్కూలుకు వెళ్లే బిడ్డకు ఏడాదికి రూ. 15,000 అందించే ‘తల్లికి వందనం’ సంక్షేమ పథకాన్ని జూలై నెలలోనే అమలు చేస్తామని కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ఉద్దేశించిన ‘సంజీవని’ డిజిటల్ హెల్త్ రికార్డ్ ప్రోగ్రామ్ గురించి ఆయన సుదీర్ఘంగా వివరించారు. సంజీవని అనేది ఒక సమగ్ర డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్. దీని ద్వారా ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ (ముందస్తు అంచనా, నివారణ, చికిత్స) ప్రణాళికలను అమలు చేసి రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడతామ‌ని సీఎం హామీ ఇచ్చారు. పీహెచ్‌సీలు నుంచి జిల్లా ఆసుపత్రులు, సూపర్ స్పెషాలిటీ సేవల వరకు మొత్తం ఆరోగ్య వ్యవస్థను ఈ ఒకే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించినట్లు చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తారు. దీని ద్వారా అపాయింట్‌మెంట్ బుకింగ్, హెల్త్ ఫాలో-అప్, వర్చువల్ కన్సల్టేషన్ సేవలు అందుతాయి. సంజీవని కార్డ్‌ల ద్వారా ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను ఎల్లప్పుడూ పర్యవేక్షిస్తారు. ఇప్పటికే 2.6 కోట్ల మందికి అంటువ్యాధులు కాని వ్యాధుల స్క్రీనింగ్ పూర్తయిందని, త్వరలోనే గ్రామం, జిల్లా, రాష్ట్ర స్థాయి వ్యాధుల ప్రొఫైల్‌లను విశ్లేషిస్తామని తెలిపారు.

రసాయన ఎరువులు, పురుగుమందుల విచక్షణారహిత వినియోగాన్ని నిరుత్సాహపరిచేందుకు ఒక ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన మిర్చి కన్సైన్‌మెంట్లను చైనా గతంలో తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేస్తూ.. రైతులందరూ ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, అప్పుడే అంతర్జాతీయంగా ఎగుమతి అవకాశాలు పెరుగుతాయని పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఏపీలో 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగుతోందని, దేశంలోనే మనం అగ్రస్థానంలో ఉన్నామని కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు.

కుటుంబ పరిమాణంపై ముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న కుటుంబాలకు రివార్డులు అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. చిన్న కుటుంబాలు భారతీయ సాంస్కృతిక విలువలకు భిన్నమైనవని, ఉమ్మడి కుటుంబాలే నిజమైన ఆనందానికి పునాది అని పేర్కొన్నారు. అలాగే, యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై పట్టు సాధించాలని సూచించారు. ఎల్ నినో ప్రభావం వల్ల నదుల్లోకి నీటి ప్రవాహం తగ్గిందని, అందువల్ల నీటి వనరులను పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు.

వైసీపీ రాజకీయంపై ముఖ్యమంత్రి ధ్వజం

రాజధాని అమరావతి విషయంలో వైయస్సార్‌సీపీ దగా చేసిందని చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. మొదట అమరావతికి అంగీకరించి, ఆ తర్వాత దాంతో జూదం ఆడారని మండిపడ్డారు. అమరావతి చట్టబద్ధమైన రాజధానిగా ఉన్నప్పటికీ.. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ‘మావిగున్’ పేరుతో రాజధాని ప్రతిపాదన తెచ్చి ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. శనివారం కూడా వైసీపీ నేతలు అమరావతిలో పర్యటించి, రైతులలో గందరగోళం సృష్టించి నిర్మాణాలను అడ్డుకోవాలని చూశారని, కానీ అక్కడి రైతులు వారిని సమర్థవంతంగా అడ్డుకున్నారని సీఎం తెలిపారు.

చివరగా, విజయవాడలో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనను ప్రస్తావిస్తూ.. ఈ దురదృష్టకర ఘటనను ఆధారం చేసుకుని ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని కులం పేరుతో టార్గెట్ చేయడం అత్యంత విచారకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్షేపించారు.

ట్యాగ్‌లు
VeligondaProjectAndhraPradeshCMChandrababuNaraChandrababuNaiduAPNewsBreakingNewsTeluguNewsDevelopmentIrrigationWaterProjects
వెలిగొండ ప్రాజెక్టుకు నిర్వాసితుల త్యాగం మరువలేం: సీఎం చంద్రబాబు - Tholi Paluku