Let's talk: editor@tmv.in
రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తనివ్వం: మంత్రి సీతక్క

రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తనివ్వం: మంత్రి సీతక్క

Gaddamidi Naveen
8 జులై, 2026

రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ప్రజలకు తాగునీటి కొరత రాకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి డా. సీతక్క స్పష్టం చేశారు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ సప్లయ్ కార్పొరేషన్ బోర్డు సమావేశం సోమవారం తెలంగాణ సచివాలయంలో మంత్రి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి సరఫరా పరిస్థితి, జలాశయాల్లో నీటి నిల్వలు, రాబోయే నెలల్లో అవసరమయ్యే నీటి లభ్యతపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందించడం ప్రభుత్వ అత్యున్నత ప్రాధాన్యత అని మంత్రి పేర్కొన్నారు. వర్షాలు ఆలస్యమైనా, వర్షపాతం తగ్గినా లేదా ఎల్‌నినో ప్రభావం ఉన్నా తాగునీటి సమస్యలు తలెత్తకుండా అధికారులు ముందస్తు కార్యాచరణతో పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కృష్ణా, గోదావరి బేసిన్‌ల ఉపరితల జల వనరుల నుంచి శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు సమావేశంలో వివరించారు. ప్రస్తుతం 29 జలాశయాల నుంచి 123 నీటి శుద్ధి కేంద్రాల ద్వారా గ్రామీణ ప్రాంతాలకు నీరు అందుతున్న నేపథ్యంలో, ప్రతి జలాశయంలో 45, 90, 180 రోజుల అవసరాలకు సరిపడా నీటి నిల్వలపై మంత్రి సమీక్షించారు. జలాశయాల నీటి మట్టాలను ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ ఇరిగేషన్ శాఖతో సమన్వయం కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.

జూలై నెలాఖరు వరకు తగిన నీటి ప్రవాహం లేకపోతే అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఉదయసముద్రానికి, తుపాకులగూడెం బ్యారేజ్ నుంచి దుమ్ముగూడెంకు నీటిని విడుదల చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిన నేపథ్యంలో, రాబోయే 45 రోజుల్లో పరిస్థితి మెరుగుపడకపోతే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన మంత్రి, భూగర్భ జలాల ఆధారిత పథకాలను వినియోగించేలా తక్షణ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.

అదనంగా, అన్ని నివాస ప్రాంతాల్లో స్థానిక నీటి వనరులను వినియోగించే ప్రత్యామ్నాయ తాగునీటి వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే బోర్‌వెల్‌లను లోతుగా తవ్వడం, ఫ్లషింగ్ చేయడం, అద్దెకు బోర్‌వెల్‌లను తీసుకోవడం వంటి చర్యలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం లేదా ఇతర వాతావరణ పరిస్థితుల వల్ల తాగునీటి సంక్షోభం తలెత్తకుండా ప్రభుత్వం పూర్తిస్థాయి అప్రమత్తతతో పనిచేస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి నివాస ప్రాంతానికి నిరంతరాయంగా సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్, మిషన్ భగీరథ ఇంజనీర్-ఇన్-చీఫ్ కృపాకర్ రెడ్డి, ఇతర చీఫ్ ఇంజనీర్లు, బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
TelanganaDrinkingWaterMissionBhagirathaWaterSupplyTelanganaGovernmentSafeDrinkingWaterWaterManagementElNinoReservoirs
రాష్ట్రంలో తాగునీటి సమస్య తలెత్తనివ్వం: మంత్రి సీతక్క - Tholi Paluku