
వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని అంగీకరించం: మంత్రి ఉత్తమ్
తెలంగాణ హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాల అధికారాలను లాక్కునేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘వీబీ-జీ రామ్-జీ చట్టం–2025’ (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ (గ్రామీణ)ను ఎట్టి పరిస్థితుల్లోనూ యథాతథంగా అంగీకరించబోమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేలా ఉన్న ఈ కేంద్ర ప్రతిపాదనపై శనివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఆయన అధ్యక్షతన రెండో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్రం తెస్తున్న ఈ చట్టం కేవలం ఉపాధి హామీ సవరణ కాదని, భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిపై జరుగుతున్న ప్రత్యక్ష దాడి అని విమర్శించారు. తెలంగాణ రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామీణ పేదల ప్రయోజనాలే మాకు పరమావధి. వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే చట్టానికి తెలంగాణ ప్రభుత్వం తలవంచదు. ఈ చట్టంలోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని న్యాయ నిపుణులు తేల్చారు. అవసరమైతే సుప్రీంకోర్టు తలుపులు తడతాం. కర్ణాటక, కేరళ వంటి పొరుగు రాష్ట్రాలతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న దాదాపు 20 పౌరసంఘాలు కూడా కేంద్ర ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. తెలంగాణ ప్రభుత్వం సొంతంగా ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావాలని సూచించాయి. కేంద్రం ప్రతిపాదించిన 60 రోజుల ఉపాధి పరిమితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ.. ప్రతి గ్రామీణ కుటుంబానికి కనీసం 200 రోజుల పాటు ఉపాధి హక్కు కల్పించాలని, చట్టబద్ధ కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశాయి. కేంద్రం ప్రతిపాదించిన 60:40 నిధుల భాగస్వామ్య విధానం వల్ల తెలంగాణపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని, దీనిపై రాష్ట్ర న్యాయశాఖ పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు.
బాగా పనిచేసే రాష్ట్రాలను శిక్షిస్తూ, కేంద్రం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఈ అంశంపై జూలై 2న జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో సమగ్రంగా చర్చించి, సొంత చట్టం లేదా న్యాయపోరాటంపై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఈ సమీక్షలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
