
హైదరాబాద్‌ను 10 ఏళ్లలో గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతాం: మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం వచ్చే దశాబ్దంలో హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. భారీ స్థాయిలో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, ఆధునిక మౌలిక వసతులను నిర్మించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధిస్తామని ఆయన పేర్కొన్నారు.
ముంబైలో నిర్వహించిన “నాస్కామ్ జీసీసీ సమ్మిట్ 2026”లో పాల్గొని ప్రసంగించిన మంత్రి “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” కింద రాష్ట్రాన్ని దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకెళ్లాలని సంకల్పించామని తెలిపారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెంచడం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రపంచంలోని అనేక నగరాలు ప్రణాళిక లేని పట్టణీకరణ వల్ల సమస్యలు ఎదుర్కొంటున్నాయని గుర్తుచేసిన ఆయన హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు రాకుండా దీర్ఘకాలిక ప్రణాళికతో అభివృద్ధి చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో భారత్ ఫ్యూచర్ సిటీ, ఏఐ సిటీ, మెట్రో రైలు విస్తరణ కొత్త విమానాశ్రయాల అభివృద్ధి, రీజినల్ రింగ్ రోడ్, ముసి నది పునరుద్ధరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, “ఐకామ్ ఇన్నోవేషన్ హబ్ వంటి పలు ప్రాజెక్టులను ప్రారంభించినట్లు తెలిపారు.
టెక్నాలజీ, బ్యాంకింగ్, లైఫ్ సైన్సెస్, సెమీకండక్టర్స్, రక్షణ, ఎఫ్‌ఎంసీజీ, అంతరిక్ష సాంకేతికత అతిథ్య రంగాల్లో గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ల కోసం హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. గత ఏడాదిలోనే 70కు పైగా జీసీసీలు హైదరాబాద్‌లో స్థాపించబడ్డాయని ఇది దేశంలోనే అత్యధికమని వివరించారు.
ఈ సంవత్సరం మరో 100 జీసీసీలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని దీని ద్వారా దాదాపు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని మంత్రి తెలిపారు. జీసీసీలను సాధారణ బ్యాక్ ఆఫీస్ కేంద్రాలుగా కాకుండా “గ్లోబల్ వ్యాల్యూ సెంటర్ల”గా మార్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తూ హైదరాబాద్‌లో నైపుణ్యంతో కూడిన మానవ వనరులు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. “మేడ్ ఇన్ తెలంగాణ” బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సంస్థలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాస్కామ్ చైర్మన్ శ్రీకాంత్, అధ్యక్షుడు రాజేష్ నంబియార్ తదితరులు పాల్గొన్నారు.
