Let's talk: editor@tmv.in
ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ‘సిల్క్ స్టేట్’గా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలో ‘సిల్క్ స్టేట్’గా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

Gaddamidi Naveen
30 మే, 2026

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ స్థాయి టెక్స్‌టైల్ హబ్‌గా మార్చే వ్యూహంలో భాగంగా, దీనిని దేశంలోనే తదుపరి ‘సిల్క్ స్టేట్’ గా అభివృద్ధి చేసేందుకు అపారమైన అవకాశాలు ఉన్నాయని కేంద్ర వస్త్ర శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ శుక్రవారం ప్రకటించారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఏపీకి వచ్చిన ఆయన, కృష్ణా జిల్లా మల్లావల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లోని ‘మోహన్ స్పింటెక్స్’ పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాంప్రదాయ చేనేత, పత్తి, టెక్నికల్ టెక్స్‌టైల్ రంగాల విస్తరణకు కేంద్రం సిద్ధం చేసిన ప్రణాళికలను వెల్లడించారు.

మంత్రి గిరిరాజ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. నా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈరోజు విజయవాడలో, రేపు విశాఖపట్నంలో పర్యటిస్తాను. ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశమై ఆంధ్రప్రదేశ్‌ను ‘సిల్క్ స్టేట్’గా ఎలా అభివృద్ధి చేయాలనే అంశంతో పాటు పత్తి సాగుపై కూడా ఉన్నత స్థాయి చర్చలు జరుపుతాను. ఏ రంగంలోనైనా అద్భుతాలు సాధించగల సామర్థ్యం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని కొనియాడారు. దేశీయ పత్తి ఉత్పత్తిలో భారీ తేడా ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రపంచవ్యాప్తంగా హెక్టారుకు సగటు 2000 కిలోల పత్తి దిగుబడి వస్తుండగా, భారత్‌లో అది కేవలం 450 కిలోలకే పరిమితమైందని తెలిపారు. ఈ లోటును తగ్గించేందుకు విత్తన విధానాలు, వ్యవసాయ సాంకేతికతపై ప్రత్యేక విధానాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ధర్మవరం చేనేత క్లస్టర్‌కు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ చేనేత రంగానికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేస్తూ.. ఇటీవల రాష్ట్రంలోని ధర్మవరంతో పాటు మరొక ప్రాంతంలో ప్రత్యేక చేనేత క్లస్టర్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. ఏపీని కేవలం సాంప్రదాయ చేనేతకే పరిమితం చేయకుండా, గ్లోబల్ మార్కెట్‌లో వేగంగా వృద్ధి చెందుతున్న ‘టెక్నికల్ టెక్స్‌టైల్స్’ రంగానికి పవర్‌హౌస్‌గా మార్చడమే కేంద్ర లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా శనివారం విశాఖపట్నంలో అడ్వాన్స్‌డ్ మెటీరియల్ తయారీ విభాగానికి చెందిన ‘గ్లాస్ ఫైబర్ యూనిట్’ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో గ్లాస్ ఫైబర్, కార్బన్ ఫైబర్, గ్రాఫిన్, అగ్రి-టెక్ రంగాలకు ఇక్కడ పెద్దపీట వేస్తామన్నారు.

కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్ రంగం కోసం రూ. 10,860 కోట్ల బడ్జెట్‌తో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకాన్ని ప్రవేశపెట్టిందని మంత్రి గుర్తుచేశారు. ఈ భారీ నిధుల్లో ఆంధ్రప్రదేశ్ గరిష్ట వాటాను దక్కించుకునేలా చొరవ చూపాలని తానే స్వయంగా ముఖ్యమంత్రిని కోరనున్నట్లు చెప్పారు. ఏపీకి గరిష్ట నిధులను విడుదల చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం భారతదేశ టెక్స్‌టైల్ మార్కెట్ విలువ 176 బిలియన్ డాలర్లు ఉండగా, దీనిని 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్రం పనిచేస్తోందని గిరిరాజ్ సింగ్ వివరించారు. భారత్ టెక్స్ ద్వారా భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన, స్థిరమైన వస్త్ర సరఫరా కేంద్రంగా పెట్టుబడుల హబ్‌గా నిలబెడతామని కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.