Let's talk: editor@tmv.in
బెంగాల్‌లో సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా

బెంగాల్‌లో సీఏఏ అమలు చేస్తాం: అమిత్ షా

Pinjari Chand
26 ఏప్రిల్, 2026

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశలోనే బీజేపీ భారీ విజయాన్ని సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. తొలి దశ పోలింగ్‌లోనే 110 సీట్లు గెలుస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను త్వరితగతిన అమలు చేస్తామని తెలిపారు. పుర్బ బర్ధమాన్ జిల్లా జమాల్‌పూర్, హౌరా జిల్లా శ్యాంపూర్ ప్రాంతాల్లో జరిగిన సభల్లో మాట్లాడుతూ ఈ ఎన్నికలు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గద్దె దింపే పోరాటమని పేర్కొన్నారు. మొదటి దశ ఓటింగ్ పూర్తయింది. ఈ దశలోనే బీజేపీ 110 సీట్లు గెలుస్తుంది. దీదీ అధికారానికి వీడ్కోలు పలకాల్సిందే అని అన్నారు. ఏప్రిల్ 23న జరిగిన తొలి దశలో 294 నియోజకవర్గాల్లో 152 స్థానాలకు పోలింగ్ జరిగింది. రెండో దశలో మిగిలిన 142 స్థానాలకు పోలింగ్ జరగనుంది.

మాటువా సమాజం ఓట్లపై దృష్టి పెట్టిన షా, మమతా బెనర్జీ సీఏఏ అమలును అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాటువా సమాజానికి పౌరసత్వం కల్పిస్తాం. ఇక వారు భయపడాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్‌ నుంచి అక్రమ చొరబాట్ల అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. చొరబాటుదారులు యువత ఉద్యోగాలను, పేదల రేషన్‌ను దోచుకుంటున్నారు. టీఎంసీ ప్రభుత్వం ఓటు బ్యాంక్ కోసం వారిని ప్రోత్సహిస్తోంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రతి చొరబాటుదారుని గుర్తించి బయటకు పంపిస్తామని తెలిపారు.

భద్రత కల్పిస్తాం

అదేవిధంగా మహిళల భద్రతపై కూడా షా తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో శాంతి, భద్రతల వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలు రాత్రి 1 గంటకైనా భయపడకుండా బయటకు వెళ్లగలిగే పరిస్థితి తీసుకొస్తామని అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులకు 7వ వేతన సంఘం ప్రయోజనాలు, మహిళలకు నెలకు రూ.3,000, నిరుద్యోగ యువతకు రూ.3,000 భృతి, గర్భిణీ స్త్రీలకు రూ.21,000 సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ‘సిండికేట్ రాజ్’ ఉందని ఆరోపిస్తూ, నిర్మాణ సామగ్రి కోసం ప్రజలు లంచాలు ఇవ్వాల్సి వస్తోందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఈ సిండికేట్ వ్యవస్థను పూర్తిగా తొలగిస్తామని పేర్కొన్నారు. రెండో దశ పోలింగ్ ముందు టీఎంసీ కార్యకర్తలకు హెచ్చరిక జారీ చేస్తూ, ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.