
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్
తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కొంతమంది కార్మిక సంఘాల నాయకులు వాస్తవాలను వక్రీకరిస్తూ కార్మికులను, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడ్డారు.
ఈ సందర్భంగా గతంలో జరిగిన సుదీర్ఘ చర్చలను మంత్రి గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నేతృత్వంలో తాను, మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, ప్రతి కార్మిక సంఘం నుంచి ఇద్దరు చొప్పున దాదాపు 30 మంది ప్రతినిధులతో సుమారు 14 గంటల పాటు చర్చించి ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు.
కార్మికులు ఉంచిన మొత్తం 32 డిమాండ్లలో 29 అంశాలు ఆర్టీసీ యాజమాన్యం పరిధిలో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఇప్పటికే చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. మిగిలిన మూడు కీలక అంశాలైన గుర్తింపు సంఘాల ఎన్నికలు, 2021 పీఆర్సీ, ఆర్టీసీ విలీనం విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే 11 శాతం పీఆర్సీ జూలై నెల జీతాల నుంచే అమల్లోకి వస్తుందని శుభవార్త చెప్పారు.
ఆర్టీసీ విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే కమిటీలో కార్మిక ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని నాటి సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. అయితే ఆ ప్రతినిధులు అధికారికంగా గుర్తింపు పొందిన కార్మిక సంఘం నుంచే ఉండాలి కాబట్టి, ముందుగా గుర్తింపు సంఘాల ఎన్నికలు జరగడం అనివార్యమని స్పష్టం చేశారు.
కార్మికుల తొలి డిమాండ్ గుర్తింపు సంఘాల ఎన్నికలే. అందుకే ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి, షెడ్యూల్ విడుదల చేసి వెరిఫికేషన్ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇలాంటి సమయంలో కొంతమంది నాయకులు మాట మార్చి, ఎన్నికలు జరగకుండా విలీన ప్రక్రియను వివాదాస్పదం చేయాలని చూడటం సరికాదని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
భవిష్యత్తులో కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే గుర్తింపు సంఘాల నేతలను విలీన కమిటీలో భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన వివరించారు. మాట మీద నిలబడే కాంగ్రెస్ ప్రభుత్వంపై కార్మికులు నమ్మకం ఉంచాలని, నాయకుల అసత్య ప్రచారాలను నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.
