Let's talk: editor@tmv.in
ప్రధాని మోడీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు

ప్రధాని మోడీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం: కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు

Gaddamidi Naveen
12 మే, 2026

కాంగ్రెస్ పార్టీని 'ఎంఎంసీ' (ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్) అని సంబోధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారుడు వి. హనుమంతరావు (వీహెచ్) తీవ్రంగా మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ త్యాగాలను అవమానించడమేనని, ప్రధానిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

సోమవారం మీడియాతో మాట్లాడిన వీహెచ్, దేశ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి పదజాలాన్ని ఉపయోగించడం తగదన్నారు. కాంగ్రెస్ పార్టీని అవమానించేలా చేసిన ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మావోయిస్టుల హింస వల్లే మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణాలు కోల్పోయారని గుర్తుచేశారు. అలాంటి పార్టీని మావోయిస్టులతో పోల్చడం దారుణం. అలాగే దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముస్లింల పాత్ర మరువలేనిదని ఆయన గుర్తుచేశారు. ప్రధానమంత్రి వ్యాఖ్యలు కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయని హనుమంతరావు అన్నారు. ఈ వ్యవహారంపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తామని, డీసీపీ, ఏసీపీలకు వినతిపత్రం సమర్పించి ప్రధానిపై చర్యలు కోరతామని వెల్లడించారు.

ఇదే సందర్భంగా జనగణన అంశంపైనా ఆయన స్పందించారు. ఇతర వెనుకబడిన వర్గాలైన ఓబీసీలకు సరైన ప్రాతినిధ్యం లేకుండా జనగణన నిర్వహించకూడదని అభిప్రాయపడ్డారు. ఓబీసీల వివరాలు స్పష్టంగా చేర్చే వరకు ఎవరూ జనగణన ప్రక్రియలో పాల్గొనవద్దని ఆయన పిలుపునిచ్చారు.

నేపథ్యం

ఆదివారం సికింద్రాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వామపక్షాల కంటే ఎక్కువగా లెఫ్ట్ భావజాలంలోకి వెళ్ళిపోయిందని, అది ఒక మౌలికవాద సంస్థగా మారిందని ఆరోపించారు. కాంగ్రెస్ ఇప్పుడు ముస్లిం లీగ్ కంటే మతతత్వంగా, మావోయిస్టుల కంటే విధ్వంసకరంగా మారింది. అందుకే ప్రజలు దీనిని ఎంఎంసీ (ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్) అని పిలుస్తున్నారని అని ప్రధాని వ్యాఖ్యానించారు.