Let's talk: editor@tmv.in
తెలంగాణ భూముల పరిరక్షణకు పోరాడతాం: కవిత

తెలంగాణ భూముల పరిరక్షణకు పోరాడతాం: కవిత

Gaddamidi Naveen
7 జూన్, 2026

తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో జరుగుతున్న భూదందాలు, నీటి సమస్యలు, రాజకీయ పరిణామాలపై తీవ్ర విమర్శలు చేశారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆమె, రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను పెద్దలకు అప్పగించే కుట్ర చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాల్లో పాల్గొంటున్నారని, వాటికి సంబంధించిన ఆధారాలను వరుసగా ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్పారు.

రేవంత్ రెడ్డి తీరు చూస్తుంటే కాంగ్రెస్‌కు ఇదే ఆఖరి సర్కార్ అని, మరో 20 ఏళ్ల పాటు ఆ పార్టీని బొందపెట్టే పనులను ఆయనే స్వయంగా చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో భూవివాదాలకు బీఆర్ఎస్ కిటికీలు తెరిస్తే, రేవంత్ రెడ్డి ఏకంగా తలుపులు తెరిచారని విమర్శించారు. ప్రాణం పోయినా సరే తెలంగాణలో ఇంచు భూమిని కూడా దోపిడీ చేయనివ్వమని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు లీగల్ ఫైట్ చేస్తామని స్పష్టం చేశారు.

ప్రభుత్వం 'హైడ్రా' పేరుతో పేదల భూములను ఖాళీ చేయిస్తోందని కవిత ఆరోపించారు. నిన్న కూడా కూకట్‌పల్లి మంజీర కాలనీలో పేదల భూములను ఖాళీ చేయించారని, కానీ మూసీ రివర్ బెడ్‌లో నిబంధనలకు విరుద్ధంగా కడుతున్న శ్రీ ఆదిత్య బిల్డింగ్‌ను మాత్రం టచ్ చేయడం లేదని మండిపడ్డారు. ఆ బిల్డర్స్ వెనుక ఒక ఎంపీ ఉన్నారని, పెద్ద చెరువులో ఏడు ఎకరాల (రూ. 700 కోట్ల విలువైన) చెరువు భూమిని కబ్జా చేసి 30 అంతస్తుల భవనం కడుతున్నా హైడ్రాకు యాక్షన్ తీసుకునే దమ్ముందా? అని సవాల్ విసిరారు. అలాగే నాగారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 59లో మేడి బావి, జాలు బావి చెరువుల వద్ద ‘మెగా’కు చెందిన ఐకాం సంస్థ ఐదు ఎకరాల భూమిని కబ్జా చేసినట్లు మున్సిపాలిటీ తీర్మానం చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఫినిక్స్ సంస్థకు 50 ఎకరాలు ఇస్తే వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దానికి మరో వంద ఎకరాలు కలిపి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.

పవన్ కళ్యాణ్‌కు సవాల్

సినిమా నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కోడికుంట చెరువుకు సంబంధించిన సర్వే నంబర్ 706 లో 10 ఎకరాల శిఖం భూమిని కొన్నారని, ఆ భూమిని ఆయన వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. తానే స్వయంగా శిఖం భూమి అయితే వాపస్ ఇస్తానని చెప్పినందున మాట నిలబెట్టుకోవాలన్నారు. అలాగే గద్దరన్నకు కారు కొనిచ్చానని పవన్ కళ్యాణ్‌ బహిరంగంగా చెబుతూ తెలంగాణ జానపద కళాకారులను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా విష కోరల్లోంచి ఎంతో పోరాడి సాధించుకున్న తెలంగాణ కచ్చితంగా తమ జాగీరేనని, ఇక్కడ మళ్లీ ఆంధ్రా నేతల రాజకీయాలు, బలవంతపు వన్ సైడ్ లవ్ నడవవని స్పష్టం చేశారు. బీజేపీకి ఇక్కడ లీడర్ లేకే పవన్ కళ్యాణ్‌ను వాడుకుంటోందని క‌విత ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రికి నీటి పారుదల సబ్జెక్టుపై కనీస అవగాహన లేదని, పాలమూరు బిడ్డ అయి ఉండి 30 నెలలుగా ఆ ప్రాజెక్టుపై రివ్యూ చేయలేదని కవిత విమర్శించారు. తాము ధర్నాలు చేస్తేనే మొదటిసారి రివ్యూ చేశారని, కానీ ఆంధ్రాకు 260 టీఎంసీల నీళ్లు తీసుకోమని చెబుతూ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్ర సీఎం, తన గురువైన చంద్రబాబు నాయుడిని కలిసి గోదావరిలో మనకు రావలసిన 200 టీఎంసీల నీటి గురించి రేవంత్ రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. చివరగా, ఉద్యమకారులకు భూముల కేటాయింపుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేసిన కవిత, వచ్చే నెల ఉప్పల్ భగాయత్, నాదర్ గుల్ పరిధిలోని భూములపై టీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూపోరాటాలు చేస్తామని ఆమె ప్రకటించారు.