Let's talk: editor@tmv.in
మద్దెల చెరువును అభివృద్ధి చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్

మద్దెల చెరువును అభివృద్ధి చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్

Gaddamidi Naveen
29 ఏప్రిల్, 2026

మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని చంపాపేట్ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సాయి నగర్ మద్దెల చెరువును సందర్శించి, అక్కడ నెలకొన్న డ్రైనేజీ సమస్యలు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.

మద్దెల చెరువు ప్రస్తుతం డ్రైనేజీ నీరు నిలిచి మురికికూపంగా మారిందని, దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు కలుషితమై ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పైప్‌లైన్ వేసినా కెపాసిటీ సరిపోక మురికినీరు చెరువులోకి చేరుతోందని, దీని ప్రక్షాళన కోసం అవసరమైతే అదనపు పైప్‌లైన్ వేసి సామర్థ్యాన్ని పెంచుతామని హామీ ఇచ్చారు. అలాగే, చెరువు చుట్టూ ఫెన్సింగ్ వేయించి, అది మాదకద్రవ్యాలకు, పోకిరీలకు అడ్డాగా మారకుండా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు

నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా డ్రైనేజీ పైప్‌లైన్ల సామర్థ్యం ఉండాలని ఈటల సూచించారు. మెగా ఫంక్షన్ హాల్ వద్ద రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న బాక్స్ డ్రైనేజీ పనులను సకాలంలో పూర్తి చేసేలా అధికారులతో మాట్లాడతానన్నారు. కార్పొరేటర్ల పదవీ కాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. రాజకీయ ఆధిపత్యం కోసం కాకుండా, ప్రజల సమస్యల పరిష్కారం కోసమే తాను నిత్యం అందుబాటులో ఉంటానని, పెండింగ్ పనులన్నింటినీ త్వరలోనే పూర్తి చేస్తానని ఎంపీ భరోసా ఇచ్చారు.

మద్దెల చెరువును అభివృద్ధి చేస్తాం: ఎంపీ ఈటల రాజేందర్ - Tholi Paluku