
యూపీలో 25 స్థానాల్లో పోటీ చేస్తాం: అథవాలే
కేంద్ర మంత్రి, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) అధ్యక్షుడు రాందాస్ అథవాలే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. 2027లో జరగనున్న ఎన్నికల్లో తమ పార్టీ 25 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు. లక్నోలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి (ఎన్డీయే కూటమిలో భాగంగా) పోటీ చేయాలని తమ పార్టీ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. అయితే 25 సీట్ల డిమాండ్ నెరవేరకపోతే, పార్టీ ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అథవాలే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ‘గూండారాజ్’ ముగిసిందని, రామమందిర సమస్య కూడా పరిష్కారమైందని అన్నారు. అయితే దళితుల సంక్షేమానికి కొన్ని కీలక డిమాండ్లు ఉంచారు.
ఐదెకరాల భూమి కేటాయించాలి
గ్రామాల్లో ప్రతి దళిత కుటుంబానికి ఐదు ఎకరాల భూమి కేటాయించాలని, అలాగే ‘సమాజ్ భవన్’ అనే కమ్యూనిటీ సెంటర్లు నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చర్యలతో పేదరికం తగ్గి, నగరాలకు వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఈ విషయాలపై సీఎం యోగిని కలిసి చర్చిస్తామని తెలిపారు. మహారాష్ట్ర కేంద్రంగా పనిచేసే ఆర్‌పీఐ(ఏ), గతంలో బీహార్, తమిళనాడు ఎన్నికల్లో కూడా పోటీ చేసింది. అయితే పెద్దగా విజయాలు సాధించలేకపోయింది. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 31 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. లోక్‌సభ ఎన్నికల్లో 2004లో మాత్రమే అథవాలే విజయం సాధించారు. అయినప్పటికీ, పార్టీ ప్రస్తుతం ఎన్డీయేలో భాగంగా ఉంది. అథవాలే రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. గత ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 403 స్థానాల్లో 255 గెలిచి ఘన విజయం సాధించగా, సమాజ్‌వాదీ పార్టీ 111 స్థానాలు దక్కించుకుంది. 2027 ఎన్నికలు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి.
