
డీఎస్సీ అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం: వైఎస్సార్సీపీ పోరాట కమిటీ
డీఎస్సీ-2025 నియామక ప్రక్రియలో జరిగిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ నిర్ణయించింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అధ్యక్షతన డీఎస్సీ పోరాట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, కల్పలత, పార్టీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన, అభ్యర్థుల అభ్యంతరాల పరిష్కారంలో చోటుచేసుకున్న అనేక అవకతవకలపై విస్తృతంగా చర్చించారు. డీఎస్సీ అక్రమాలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎందుకు స్పందించడం లేదని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారానికి మించిన స్థాయిలో ఏపీలో డీఎస్సీ అక్రమాలు జరిగాయని వారు ఆరోపించారు. ఎస్‌సీఈఆర్టీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న నవీన్ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి కృష్ణా జిల్లా టాపర్‌గా నిలిచినప్పటికీ, అతనికి ఉద్యోగం రాకపోవడం వెనుక ఉన్న రహస్యాన్ని ప్రభుత్వం తేల్చాలని డిమాండ్ చేశారు.
ఫలితాలపై 30 వేలకుపైగా గ్రీవెన్సులు వచ్చినప్పటికీ, అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయకుండా ప్రభుత్వం వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అక్రమాలను ప్రశ్నిస్తున్న బాధిత అభ్యర్థులపై కొందరు ఉన్నతాధికారులు తప్పుడు ప్రచారం చేస్తూ, భయభ్రాంతులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఈ వ్యవహారంపై పదుల సంఖ్యలో కోర్టులో రిట్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. నష్టపోయిన అభ్యర్థుల తరఫున న్యాయపోరాటం కొనసాగిస్తూ, ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్తామన్నారు. డీఎస్సీ-2025 వ్యవహారంలో వెలుగులోకి వచ్చిన ప్రతి అంశంపై తక్షణమే సీబీఐతో నిష్పాక్షిక విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ డీఎస్సీ పోరాట కమిటీ డిమాండ్ చేసింది.
