Let's talk: editor@tmv.in
ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి
ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి
ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి

ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి

Gaddamidi Naveen
29 జూన్, 2026

ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా. ఇది నా కల.. ఒట్టేసి చెబుతున్నా మూసీని శుద్ధి చేసి దేశానికే తలమానికంగా తీర్చిదిద్దుతాం అని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘంటాపథంగా తేల్చిచెప్పారు. ఆదివారం నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఎన్‌జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి, నల్గొండ నేలపై కృష్ణా జలాలను పారిస్తానని సీఎం ప్రకటించారు. దీనితో పాటు డిండి ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తామన్నారు. మూసీ కాలుష్యం వల్ల ఇబ్రహీంపట్నం, భువనగిరి, మునుగోడు, నల్గొండ ప్రజలు నష్టపోతున్నారని, ప్రక్షాళన చేస్తుంటే కొందరు కడుపులో విషం పెట్టుకుని అడ్డుపడుతున్నారని సీఎం విమర్శించారు.

నల్గొండలో రూ. 13 వేల కోట్ల ‘హామ్’ రోడ్ల విప్లవం

ముఖ్యమంత్రి కనగల్ మార్కెట్ యార్డులో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో రూ. 13,060 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న హైబ్రీడ్ యాన్యుటీ మోడల్ (హామ్) రోడ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 34 ప్యాకేజీలలో 6,092 కి.మీ. పొడవు గల 441 రహదారులను విస్తరించనున్నారు. అనంతరం నల్గొండ పట్టణంలో టీయూఎఫ్ఐడీసీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ. 83 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ సభలోనే నీలగిరి జిల్లా మహిళా సమాఖ్య ప్రతినిధులకు సీఎం చెక్కులను పంపిణీ చేశారు.

గత 30 నెలల ప్రజా ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని సీఎం పేర్కొన్నారు. గత పదేళ్లలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. లక్షలాది కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం, 3.28 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.

రైతుల సంక్షేమం కోసం రూ.1.56 లక్షల కోట్లు ఖర్చు చేసి, 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు పరిష్కారం చూపడం, కులగణన నిర్వహించడం, 70 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం వంటి కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు విద్యా వ్యవస్థను విస్తరించి, అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, ఐటీఐలను అడ్వాన్స్‌డ్ ట్రైనింగ్ సెంటర్లుగా మారుస్తున్నామని వెల్లడించారు.

ఈ అధికారిక కార్యక్రమాల్లో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
RevanthReddyMusiRiverMusiRejuvenationNalgondaSLBCDindiProjectTelanganaTelanganaDevelopmentHAMRoadsDrinkingWaterInfrastructure
ఎవరు అడ్డుకున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా: సీఎం రేవంత్ రెడ్డి - Tholi Paluku