Let's talk: editor@tmv.in
చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి వివేక్

చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం: మంత్రి వివేక్

Gaddamidi Naveen
29 మే, 2026

రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. చెన్నూరు మండలం బావురావుపేటలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించి, కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈసారి పంట దిగుబడి చాలా ఎక్కువగా వచ్చిందని, గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 1.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నామని తెలిపారు. ఈ కొనుగోళ్ల ప్రక్రియ జూన్ 6వ తేదీ వరకు నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. రవాణా ఆలస్యం కాకుండా పెద్దపల్లిలో రైతుల కోసం మూడు గోదాములను కేటాయించామని చెప్పారు. హమాలీల కొరత వల్ల కొంత ఆలస్యం జరిగినప్పటికీ.. సింగరేణి నుంచి 40 లారీలు, మైనింగ్ శాఖ నుంచి 45 లారీలు కలిపి మొత్తం 85 లారీలను ఏర్పాటు చేశామని, వీటి ద్వారా ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తామని భరోసా ఇచ్చారు.

బీఆర్‌ఎస్, బాల్క సుమన్‌పై తీవ్ర విమర్శలు

కొనుగోళ్లు సజావుగా జరుగుతుంటే బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రి విమర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు ఓడించిన ఫ్రస్ట్రేషన్‌లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్ చేసే ధర్ణాలకు రైతులు ఎవరూ రావడం లేదని స్వయంగా సుమనే ఒప్పుకున్నాడు అని మంత్రి ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయాలని చూస్తే చట్టప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నేతలు వందల కోట్లు, వందల కేసులు పెట్టినా ప్రజలు బుద్ధి చెప్పారన్నారు.

కేటీఆర్‌ సమాధానం చెప్పాలి

లక్షల కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి కమీషన్లు తీసుకున్నారే తప్ప, గత ప్రభుత్వం రైతులకు ఒక్క చుక్క నీరివ్వలేదని మండిపడ్డారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్ వల్ల నష్టపోయిన రైతులకు తామే వ్యక్తిగతంగా పరిహారం అందించామని గుర్తుచేశారు. బాల్క సుమన్ చేస్తున్న చట్టవ్యతిరేక వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని, ఆయన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఆదర్శంగా నిలవాలి తప్ప, ప్రజలను, నాయకులను తప్పుదోవ పట్టించి విధ్వంసాలు సృష్టించవద్దని మంత్రి వివేక్ హితవు పలికారు.