

"ప్రతి గింజా కొంటాం.. తల తాకట్టు పెట్టయినా ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం" - సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సోమవారం కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పర్యటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు, నీటి ప్రాజెక్టులు, గిరిజన గూడాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రతి గింజా కొంటాం.. రైతులు అధైర్యపడొద్దు
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రైతుల వద్ద ఉన్న ప్రతి క్వింటాల్ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రెండు రోజులు అటుఇటైనా చివరి గింజ వరకు సేకరిస్తామని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల తడిసిన ధాన్యానికి కూడా కనీస మద్దతు ధర కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో ఇప్పటికే 62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, మిగిలిన మొత్తంతో కలిపి మొత్తం 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. అలాగే రాష్ట్రంలో పండిన 40 లక్షల టన్నుల మొక్కజొన్నలు, జొన్నలు, పొద్దుతిరుగుడు పంటలను కూడా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర వైఖరిపై ధ్వజం
ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వివక్షను ముఖ్యమంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం మద్దతు ధర ప్రకటించి వదిలేయడం కాకుండా, ఇతర రాష్ట్రాలకు ఇస్తున్నట్లే తెలంగాణ ధాన్యాన్ని కూడా సేకరించాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని గుర్తుచేశారు. తెలంగాణ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ విషయంలో దూతగా వ్యవహరించి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. కేంద్రం గనుక జూన్ 15 లోపు స్పందించకపోతే తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని సీఎం ఈ సందర్భంగా హెచ్చరించారు. ప్రజా ప్రభుత్వానికి ఎలాంటి పంతాలు, బేషజాలు లేవని, కేవలం రైతాంగ సమస్యల పరిష్కారమే తమకు కావాలని స్పష్టం చేశారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై మహారాష్ట్ర నిర్లక్ష్యం
ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై సీఎం సుదీర్ఘంగా మాట్లాడారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి మహారాష్ట్రలో 2 వేల ఎకరాల భూసేకరణ జరగాల్సి ఉందన్నారు. దీనికోసం ఏడాది కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నా, ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కనీస గౌరవం ఇవ్వకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. అంతరాలను తొలగించుకోవడానికి సమయం ఇవ్వాలని లేఖ రాసినా స్పందన లేదన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపిన విషయాన్ని గుర్తు చేస్తూ, కేంద్రం చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గూడాల్లో గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గత 60, 70 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ఈ వెనుకబాటుతనాన్ని తొలగించడానికే తమ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తోందని రేవంత్ రెడ్డి తెలిపారు. నాగోబా జాతర సందర్భంగా గిరిజన పటేళ్లు కోరిన విధంగా, ఐటీడీఏ ప్రాంతాల్లో ఇప్పటికే 21 వేల అదనపు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రకటించారు. తండాలు, గూడాల్లో నూటికి నూరు శాతం అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు అందించడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. "పేదోడు గుడిసెలో ఉండొద్దు" అనేదే ప్రభుత్వ లక్ష్యమని, పార్టీలకు అతీతంగా వివక్ష లేని సంక్షేమాన్ని అందిస్తామని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు డెడ్‌లైన్
రాష్ట్రంలో పిల్లల ఫీజులు, ఉద్యోగుల పెన్షన్ల వంటి ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నప్పటికీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ఒక్క బిల్లును కూడా ప్రభుత్వం ఆపలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అవసరమైతే తల తాకట్టు పెట్టయినా పేదలకు ఇళ్లు కట్టించి తీరుతామని అభయమిచ్చారు. ఇళ్ల అవసరాలను గుర్తించడానికి నాలుగు రోజుల పాటు గూడాల్లోనే ఉండి గ్రామసభలు నిర్వహించాలని జిల్లా ఇంచార్జీ మంత్రిని ఆదేశించారు. ఏడాది తిరిగేలోపు గూడాల్లో ఒక్క గుడిసె కూడా కనిపించకూడదని చెప్తూ... వచ్చే సెప్టెంబర్ 17, 2026 నాటికి రాష్ట్రంలో మరో లక్ష ఇళ్లలో లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా ఏర్పాట్లు చేయాలని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
ఈ బహిరంగ సభలో రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, డాక్టర్ వివేక్ వెంకటస్వామిలతో పాటు పలువురు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
