Let's talk: editor@tmv.in
డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేస్తాం: ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

Gaddamidi Naveen
21 మే, 2026

గత వైసీపీ పాలనలో దారుణ హత్యకు గురైన దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం విశ్రమింపదని నందిగామ శాసనసభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం ఆమె కార్యాలయం నుంచి ఒక అధికారిక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

నాటి వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ హత్యకు పాల్పడినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ, జగన్ రెడ్డి ప్రభుత్వం కేసును పూర్తిగా తొక్కిపెట్టిందని ఆమె మండిపడ్డారు. నిందితుడిని కాపాడేందుకు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేసి, సాక్ష్యాలను నాశనం చేశారని ఆరోపించారు. వైసీపీ పాలనపై విమర్శలు చేస్తూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల మళ్లింపు, దళితుల ఆత్మగౌరవానికి సంబంధించిన సంస్థల పేర్ల మార్పు, అలాగే దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ ఘటన వంటి అంశాలను ఆమె ప్రస్తావించారు. గత ప్రభుత్వంలో దళితులు, మహిళలు, యువతపై అక్రమ కేసులు, భూకబ్జాలు, వేధింపులు పెరిగాయని ఆమె ఆరోపించారు.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని సమగ్ర విచారణ చేపడుతోందని సౌమ్య తెలిపారు. ప్రత్యేక న్యాయవాదిని నియమించి విచారణను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రధాన నిందితులు అనంతబాబు (ఏ1), సహనిందితురాలు లక్ష్మీదుర్గ (ఏ2) పై క్రిమినల్ విచారణను త్వరితగతిన పూర్తి చేసి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. గత ప్రభుత్వంలో దాచిపెట్టిన ఫైళ్లు, కుట్రలను వెలికితీసి, బాధ్యులైన అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం కుటుంబానికి ప్రభుత్వం తరఫున పూర్తి సంఘీభావం తెలియజేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.