
సింగరేణి పాత వైభవాన్ని తిరిగి తీసుకొస్తాం:మంత్రి వివేక్ వెంకటస్వామి
సింగరేణి సంస్థకు పాత వైభవాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రజా పాలన ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర శ్రమ, ఉపాధి, గనులు, భూగర్భ శాస్త్ర శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. గురువారం మందమర్రి సింగరేణి ప్రాంతంలో పర్యటించిన ఆయన కొత్త గనులను ప్రారంభించి వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వెల్లడించారు. గత ప్రభుత్వం సింగరేణిని ఆర్థికంగా దెబ్బతీసిందని ఒక్క కొత్త గనిని కూడా ప్రారంభించకుండా సంస్థను నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు.
పర్యటనలో భాగంగా మంత్రి అనూహ్యంగా కేకే-5 భూగర్భ గనిలోకి కార్మికులతో కలిసి దిగి వెళ్లారు. వందల అడుగుల లోతులో కార్మికులు పనిచేసే క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించిన ఆయన, వారితో నేరుగా ముచ్చటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులు తమ పీఆర్‌సీ బకాయిలపై విధిస్తున్న ఆదాయపు పన్ను భారాన్ని తగ్గించాలని అదేవిదంగా తమ సొంత ఇంటి కల నెరవేరేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి, పన్ను సమస్యను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లామని రిటైర్డ్ కార్మికులకు కనీసం రూ. 10,000 పెన్షన్ వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తోందని భరోసా ఇచ్చారు.
సింగరేణి అభివృద్ధిలో తన తండ్రి, మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి చేసిన కృషిని ఈ సందర్భంగా మంత్రి స్మరించుకున్నారు. గతంలో కాకా రూ. 400 కోట్ల నిధులు సమకూర్చి, లక్ష మంది కార్మికుల ఉద్యోగాలను కాపాడారని గుర్తు చేస్తూ తన కుటుంబానికి సింగరేణితో విడదీయలేని అనుబంధం ఉందన్నారు. ప్రస్తుతం ఆర్‌కేపీ ఓపెన్‌కాస్ట్ ఫేజ్-2 ప్రాజెక్టు ద్వారా సుమారు 5,000 మందికి కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని అటవీ అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామని మంత్రి ప్రకటించారు. కాంట్రాక్ట్ కార్మికుల కనీస వేతనాల పెంపు వంటి సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం మందమర్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రమశక్తి అవార్డు గ్రహీతలు పవన్ కుమార్, పుల్లూరి లక్ష్మణ్‌లను మంత్రి శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్మికులు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తిపై దృష్టి సారించాలని, అదే సమయంలో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మందమర్రి ఏరియా జీఎం ఎన్. రాధాకృష్ణతో పాటు వివిధ కార్మిక సంఘాల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. చివరగా కార్మికులతో కలిసి మంత్రి భద్రతా ప్రమాణాల ప్రతిజ్ఞలో పాల్గొన్నారు.
