
హైకమాండ్ నిర్ణయానికే కట్టుబడి ఉంటాం: డీకే శివకుమార్
కర్ణాటకలో నాయకత్వ మార్పు అంశంపై వస్తున్న ఊహాగానాల మధ్య, ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కలిసి తాము కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని బెంగళూరుకు చేరుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, పార్టీ నాయకత్వంపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పు, కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మే 4న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి. ఈ విషయాలపై ఇప్పుడే మాట్లాడను. సమయం వచ్చినప్పుడు మీకు తెలుస్తుందని అన్నారు. పార్టీ అంతర్గత విభేదాలపై వచ్చిన వార్తలను కూడా ఆయన ఖండిస్తూ ఏ సమస్యలూ లేవని స్పష్టం చేశారు.
ఫ్లెక్సీలు వేయొద్దు.. కేసులు పెడతాం
ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తిచేసుకున్న నేపథ్యంలో నాయకత్వ మార్పు ప్రశ్నపై స్పందిస్తూ ఈ అంశాన్ని నేను ఎప్పుడూ చర్చించలేదు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము అంగీకరిస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా, 2023లో ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిద్ధరామయ్య-శివకుమార్ మధ్య జరిగినట్లు చెప్పబడుతున్న అధికారాన్ని పంచుకోనేందుకు ఒప్పందం జరిగిన కారణంగానే ఈ ఊహాగానాలు పెరిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక షెడ్యూల్డ్ కులాల అంతర్గత రిజర్వేషన్ అంశంపై బీజేపీ చేసిన విమర్శలకు సమాధానంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చిందని శివకుమార్ చెప్పారు. ప్రతి వర్గానికి న్యాయం చేసే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. అదేవిధంగా, మే 15న తన జన్మదినం సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు వేయవద్దని పార్టీ కార్యకర్తలకు ఆయన హెచ్చరించారు. నియమాలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయాలని అధికారులకు ఇప్పటికే సూచించినట్లు తెలిపారు. మొత్తంగా, కర్ణాటక కాంగ్రెస్‌లో నాయకత్వ మార్పుపై ఊహాగానాల మధ్య శివకుమార్ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
