Let's talk: editor@tmv.in
జనగణనలో భాగస్వాములు కావాలి: ఏపీ సీఎం

జనగణనలో భాగస్వాములు కావాలి: ఏపీ సీఎం

Panthagani Anusha
17 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో గురువారం నుంచి ప్రారంభమైన స్వీయ గణన ప్రక్రియలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి అడుగు వేశారు. హౌస్ లిస్టింగ్ –హౌస్ సెన్సస్ కార్యక్రమంలో భాగంగా అమరావతిలోని తన నివాసం నుంచి ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ముఖ్యమంత్రి స్వయంగా తన వివరాలను నమోదు చేశారు. ఏపీ జనగణన డైరెక్టర్ జె. నివాస్ సమక్షంలో 'se.census.gov.in' వెబ్‌సైట్ ద్వారా డేటా ఎంట్రీ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పోర్టల్‌లో పొందుపరిచిన 33 ప్రశ్నల గురించి డేటా భద్రత గురించి అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

సంక్షేమ ఫలాల అందజేతలో కీలకం

వివరాల నమోదు అనంతరం ముఖ్యమంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు సమానంగా అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. "కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి జనగణన అత్యంత కీలకం. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న తొలి జనగణన కార్యక్రమం ఇదే కావడం విశేషం. ఈ ప్రక్రియ ద్వారా సేకరించే గణాంకాలు కేవలం సమాచారం మాత్రమే కాదని నవ్యాంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణానికి బలమైన పునాది అని సీఎం పేర్కొన్నారు.

మే 1 నుంచి ఇంటింటికి ఎన్యుమరేటర్లు

ప్రస్తుతం జరుగుతున్న గణన ప్రక్రియ రెండు దశల్లో ఉంటుందని అధికారులు వెల్లడించారు. తొలి దశలో హౌస్ లిస్టింగ్ జరుగుతుండగా జనాభా గణనను వచ్చే ఏడాది చేపట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీ లోపు ప్రజలందరూ ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉందని ఆ తర్వాత మే 1 నుంచి మే 30 వరకు ఎన్యుమరేటర్లు నేరుగా ఇళ్లకు వచ్చి భౌతిక ధృవీకరణ నిర్వహిస్తారని వివరించారు.

ప్రతి ఒక్కరూ స్పందించాలి

రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి పౌరుడు చురుకైన పాత్ర పోషించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే సమయంలో ఖచ్చితమైన సమాచారాన్ని అందించాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి సంక్షేమ కార్యక్రమం అర్హులైన వారికి చేరడానికి ఈ గణాంకాలు దిక్సూచిలా పనిచేస్తాయని ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆకాంక్షించారు.