
కులాలను దాటి ముందుకు సాగాలి: రాష్ట్రపతి ముర్ము
దేశంలో కుల విభజనలను దాటి సమగ్ర సమాజ నిర్మాణం కోసం అందరూ కలిసి పనిచేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. ఇప్పుడు సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ‘ఉన్నవారు–లేనివారు’ మధ్య ఉన్న అంతరం అని పేర్కొన్నారు. డాక్టర్ బీఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని లోక్‌భవన్‌లో నిర్వహించిన ‘సామాజిక సమరస్తా మహోత్సవ్’ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కులవ్యవస్థ గతానికి చెందిందని, ఇప్పుడు సమాజం ఒకటిగా ముందుకు సాగాలని రాష్ట్రపతి అన్నారు. కులవ్యవస్థను సృష్టించిన వారు ఇక లేరు. మనం కలిసి ముందుకు సాగాలి. ఒక విధంగా చూస్తే ఇప్పుడు రెండు వర్గాలే ఉన్నాయి. ఉన్నవారు, లేనివారని ఆమె వ్యాఖ్యానించారు. సామాజిక సామరస్యం కోసం ప్రతి ఒక్కరూ తమ స్వార్థాలను పక్కనబెట్టి పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆమె సూచించారు. మనమంతా ఒకటే. ఈ దేశ పౌరుల మధ్య కులం, వర్గం, భాష లేదా ప్రాంతం ఆధారంగా ఎలాంటి తేడాలు ఉండకూడదని ముర్ము పేర్కొన్నారు.
గ్రామాల అభివృద్ధి దేశ పురోగతికి కీలక
భారత సంస్కృతి కరుణ, సమానత్వం, పరస్పర సంక్షేమం, ఐక్యతపై ఆధారపడిందని ఆమె తెలిపారు. అన్ని విభేదాలను దాటి వివక్ష లేకుండా ఐక్యంగా నిలబడటమే నిజమైన సామాజిక సామరస్యం అని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధి దేశ పురోగతికి కీలకమని రాష్ట్రపతి అన్నారు. దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంటుంది. సామరస్యతతో కూడిన సమాజ నిర్మాణానికి మార్గం కూడా గ్రామాల ద్వారానే ఉంటుంది. వైవిధ్యం ఉన్నప్పటికీ గ్రామాల్లో ప్రజల మధ్య అనురాగం, పరస్పర అవగాహన కనిపిస్తుందని ఆమె చెప్పారు. గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని ఆమె స్పష్టం చేశారు. అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం సందేశాన్ని గుర్తుచేసిన ముర్ము, ఆయన ఇచ్చిన విద్యను పొందండి అనే పిలుపు ఇప్పటికీ ప్రాసంగికమని అన్నారు. వ్యక్తిగత, జాతీయ అభివృద్ధికి విద్యే పునాది అని పేర్కొన్నారు.
అట్టడగు వర్గాలకు విద్య అందాలి
భారత రాజ్యాంగం విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అట్టడుగు వర్గాలకు విద్య అందేలా చూడడం మన బాధ్యత అని ఆమె తెలిపారు. విద్యతో పాటు నైతిక విలువలను కూడా పెంపొందించాలని సూచించారు. ఆరోగ్యం, పరిశుభ్రమైన వాతావరణం వ్యక్తి, సమాజ అభివృద్ధికి అత్యవసరమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సమాజానికి ఉపయోగపడేలా ప్రతి వ్యక్తి తన సామర్థ్యాన్ని వినియోగించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. విజయం సాధించడం మంచిదే. కానీ ఆ విజయం ఎంతమందికి ఉపయోగపడిందో చూసినప్పుడే అది అర్థవంతమవుతుంది. దేశాన్ని పూర్తిగా మార్చలేకపోయినా, ఇతరుల కోసం మనం ఏమి చేయగలమో ఆలోచించాలని ఆమె అన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ప్రభుత్వాలు తమ బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పటికీ ప్రజలూ స్వయంగా ముందుకు వచ్చి స్వావలంబన సాధించాలని ఆమె సూచించారు. సహకార రంగం, స్థానిక సమాజాలు సమగ్ర అభివృద్ధికి కీలకమని చెప్పారు. పరిశుభ్రత, పశుపోషణ వంటి కార్యక్రమాలు సామాజిక సంక్షేమానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంగ్వీ తదితరులు పాల్గొన్నారు.
