Let's talk: editor@tmv.in
ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్
ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్

ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Gaddamidi Naveen
9 జులై, 2026

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో రూ.12 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్‌స్టేషన్‌కు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం నాగర్‌కర్నూల్–వనపర్తి మధ్య కొత్తగా ప్రారంభించిన ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సేవలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా రవాణా శాఖ కార్యాలయాన్ని మంత్రులు ప్రారంభించారు. అనంతరం ఉయ్యాలవాడ బీసీ గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలోని వసతులను పరిశీలించి విద్యార్థుల సంక్షేమంపై ఆరా తీశారు.

అనంతరం నిర్వహించిన సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నాగర్‌కర్నూల్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆధునిక బస్‌స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఇప్పటివరకు 320 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించి, సుమారు రూ.11,371 కోట్ల మేర ప్రయాణ వ్యయాన్ని ఆదా చేసుకున్నారని పేర్కొన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు 55 రోజులపాటు సమ్మె చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కార్మికుల సమస్యలను వేగంగా పరిష్కరించి, సంస్థను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన ప్రభుత్వంలో ఆర్టీసీని ఆపరేషనల్ నష్టాల నుంచి లాభాల దిశగా తీసుకువచ్చామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న పీఆర్సీ అమలు, బాండ్లు, డీఏల విడుదల, కారుణ్య నియామకాలు, కొత్త ఉద్యోగాల భర్తీ, కొత్త బస్సుల కొనుగోలు వంటి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గతంలో విధుల నుంచి తొలగించిన ఉద్యోగులను తిరిగి సేవల్లోకి తీసుకున్నామని తెలిపారు.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆర్టీసీ బస్సులు ప్రతిరోజూ సుమారు 30 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తూ 65 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్నాయని మంత్రి వివరించారు. హైదరాబాద్‌లో 375 కొత్త రూట్లలో బస్సులు నడుపుతూ రోజుకు అదనంగా 7 లక్షల మందికి సేవలు అందిస్తున్నామని, అవసరమైన ప్రాంతాల్లో మరిన్ని సర్వీసులు ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేస్తోందన్నారు.

మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని మంత్రులు పిలుపునిచ్చారు. రవాణా, పోలీసు శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్న "అరైవ్ అలైవ్" కార్యక్రమం ద్వారా రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, టీజీఎస్‌ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్‌లు
NagarkurnoolTelanganaRTCTGSRTCBusStationPonnamPrabhakarJupallyKrishnaRaoPublicTransportTelanganaDevelopmentInfrastructure
ఆర్టీసీని లాభాల బాటలోకి తెచ్చాం: మంత్రి పొన్నం ప్రభాకర్ - Tholi Paluku