
ఇందిరమ్మ ఇండ్లకు కేంద్రవాటా కోసం ఎదురు చూస్తున్నాం:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల కోసం మార్చి నెల నుంచి ఎదురుచూస్తున్నామని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఒక్కో ఇంటికి కేంద్రం నుంచి సుమారు రూ.1.13 లక్షల చొప్పున నిధులు రావాల్సి ఉందని ఆ నిధులు విడుదల అవుతాయనే ఆశతో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన చివరి విడత బిల్లులను తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. అయితే మరో 15 నుంచి 20 రోజుల్లో కేంద్రం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ మొత్తాన్ని భరిస్తుందని స్పష్టం చేశారు.
ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన మంత్రి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పలుమార్లు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. కాగా రాష్ట్రంలో తొలి విడతగా మూడున్నర లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇప్పటివరకు సుమారు 1.32 లక్షల ఇండ్లు పూర్తయ్యాయని వెల్లడించారు. మరో 68 వేల నుంచి 72 వేల ఇండ్లలో శ్లాబ్ పనులు జూన్ నెలాఖరుకల్లా పూర్తవుతాయని రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని జూన్ 2న ఆదిలాబాద్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు.
అదేవిధంగా ఇప్పటికే కొంతవరకు నిర్మాణం చేసిన ఇండ్లకు కూడా పథకం వర్తించేలా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. బేస్‌మెంట్, గోడలు లేదా శ్లాబ్ వరకు నిర్మాణం చేసిన ఇండ్లకు కూడా ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇవ్వాలనే విషయంపై ఈ నెల 21న జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
అయితే రాష్ట్రంలో భూముల ధరలను కూడా ఈ నెలాఖరులోగా సవరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ ధరలకు సరిపోని విధంగా భూముల ధరలు ఉండటంతో వాటిని శాస్త్రీయంగా సరిచేస్తామని గత ప్రభుత్వ హయాంలో భూముల ధరలను అశాస్త్రీయంగా పెంచారని విమర్శించారు.
మరోవైపు అసంపూర్తిగా ఉన్న 2బిహెచ్‌కే ఇండ్ల పనులను పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులకే మిగిలిన నిధులు ఇచ్చి వారిచేతే పనులు పూర్తి చేయించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు.
ఇక ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టిని స్థానికంగా ఉచితంగా అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రజాదర్బార్ కార్యక్రమాల్లో ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు, ధరణి భూ సమస్యలు, ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డుల సమస్యలపై ప్రజలు దరఖాస్తులు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
