Let's talk: editor@tmv.in
సమ్మె విరమిస్తున్నాం: ఆర్టిజన్ల జేఏసీ

సమ్మె విరమిస్తున్నాం: ఆర్టిజన్ల జేఏసీ

Gaddamidi Naveen
18 ఏప్రిల్, 2026

తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన విద్యుత్ ఆర్టిజన్ల సమ్మెకు తెరపడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చొరవతో, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తక్షణమే విరమిస్తున్నట్లు విద్యుత్ ఆర్టిజన్ల జేఏసీ ప్రకటించింది.

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో ఆర్టిజన్ జేఏసీ నాయకులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారంపై ఉన్నతాధికారులతో చర్చలకు అనుమతించినందుకు సానుకూలంగా స్పందించినందుకు జేఏసీ కన్వీనర్ సాయిలు డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. గత కొద్దిరోజులుగా సమ్మె బాట పట్టిన విద్యుత్ శాఖ ఆర్టిజన్లు సమ్మె విరమించుకున్నారు.

ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ, ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే విధంగా ఉద్యోగులు విధులు నిర్వహించాలని సూచించారు. ముఖ్యంగా వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో, సమ్మెకు దిగడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. సమ్మెలకు బదులుగా చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం కనుగొనాలని ఆయన సూచించారు. అదే విధంగా, విద్యుత్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం మానవతా దృక్పథంతో పరిశీలిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. విద్యుత్ కార్మిక సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి ఉందని ఆయ‌న పేర్కొన్నారు.

ఇంకా, ఆర్థిక భారం లేకుండా పరిష్కరించగల అంశాలపై ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్ ఆర్టిజన్ జేఏసీతో చర్చలు జరిపి వాటి పరిష్కారానికి కృషి చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ సమావేశంలో ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాస్కర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఆర్టిజన్ జేఏసీ ఛైర్మన్ సతీష్ రెడ్డి, కో-ఛైర్మన్లు చందారెడ్డి, శ్రీధర్ గౌడ్, కోశాధికారి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

సమ్మె విరమణతో రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరా, నిర్వహణ పనులు తిరిగి యధాస్థితికి చేరుకోనున్నాయి. వేసవి ఎండల దృష్ట్యా వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఆర్టిజన్లు విధుల్లో చేరడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.