Let's talk: editor@tmv.in
జలధార-జలహారతిని సవాలుగా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు

జలధార-జలహారతిని సవాలుగా తీసుకోవాలి: సీఎం చంద్రబాబు

Panthagani Anusha
20 ఏప్రిల్, 2026

రాష్ట్రంలో నీటి వనరుల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలధార–జలహారతి’ కార్యక్రమాన్ని ఒక సవాలుగా స్వీకరించి అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భూగర్భ జలమట్టాలను పెంచడంతో పాటు, సాగునీటి మౌలిక సదుపాయాల బలోపేతానికి ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ దిక్సూచిగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు.

రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని కాల్వలు, చెరువుల మరమ్మతు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం సూచించారు. "భారీ వర్షాలు కురిసినా చుక్క నీరు వృథా కాకుండా నిల్వ చేసుకునేలా మన ప్రణాళికలు ఉండాలి. ఎక్కడా నీరు నిలిచిపోయి ప్రజలు ఇబ్బంది పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి" అని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం ముగిసే సమయానికి రాష్ట్రంలోని ప్రతి చెరువు జలకళతో ఉట్టిపడాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పునరుద్ఘాటించారు.

ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంలో మండల నోడల్ పాత్ర కీలకమని ముఖ్యమంత్రి గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ మండలాల్లోనూ పనుల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. కాగా ‘జలధార–జలహారతి’ కార్యక్రమ సమన్వయకర్తగా అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్‌ను రాష్ట్ర స్థాయి నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. అన్నమయ్య జిల్లా నీటి సంరక్షణలో రాష్ట్రానికే ఆదర్శంగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో డ్రైనేజీ వ్యవస్థల మరమ్మతులపై ప్రత్యేక దృష్టి సారించాలని నీటి పారుదలకు ఆటంకం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. భూగర్భ జలాల స్థాయి పెరిగితే సాగుకు మోటార్ల వినియోగం తగ్గి తద్వారా విద్యుత్ ఆదా అవుతుందని సీఎం వివరించారు. ఇదే క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల పుష్కరిణీల్లో ఏడాది పొడవునా నీటి లభ్యత ఉండేలా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు.

కేవలం ప్రభుత్వ యంత్రాంగమే కాకుండా ‘జలధార–జలహారతి’లో సామాన్య ప్రజలను రైతులను భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. చేపట్టిన పనుల వల్ల కలిగే ప్రయోజనాలపై ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని పారదర్శకతకు పెద్దపీట వేయాలని సూచించారు. 2026 ఏప్రిల్‌లో ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక కార్యాచరణ ద్వారా ఏపీని జలసమృద్ధి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు.