Let's talk: editor@tmv.in
‘గోదారి గట్టుపైనా’ చిత్రంలోని చూడు చూడు.. మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట ట్రెండింగ్

‘గోదారి గట్టుపైనా’ చిత్రంలోని చూడు చూడు.. మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట ట్రెండింగ్

Panthagani Anusha
21 ఏప్రిల్, 2026

టాలీవుడ్‌లో మ్యూజికల్ హిట్స్ అనేవి అప్పుడప్పుడు వస్తుంటాయి, కానీ కొన్ని పాటలు మాత్రం కాలంతో సంబంధం లేకుండా శ్రోతల మనసుల్లో గూడు కట్టుకుంటాయి. సరిగ్గా ఇదే బాటలో సాగుతోంది సుమంత్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న ‘గోదారి గట్టుపైనా’ చిత్రంలోని ‘చూడు చూడు’ పాట. ఈ పాట విడుదలై దాదాపు ఐదు నెలలు గడిచినప్పటికీ, నేటికీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై టాప్ ట్రెండింగ్‌లో కొనసాగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఈ డిజిటల్ యుగంలో ఒక పాట లైఫ్ టైమ్ కేవలం కొన్ని వారాలు మాత్రమే ఉంటుంది కానీ ఈ మెలోడీ మాత్రం రోజురోజుకూ తన ప్రభావాన్ని పెంచుకుంటూనే ఉంది.

ఈ పాట ఇంతటి ఘనవిజయం సాధించడానికి ప్రధాన కారణం అందులోని స్వచ్ఛమైన గోదావరి నేపథ్యం సంగీత దర్శకుడు నాగ వంశీ అందించిన ప్రాణం పోసే ట్యూన్. గాయకుడు హరిచరణ్ తన మధురమైన గాత్రంతో ఈ పాటకు ఆత్మను అద్దగా, దినేష్ కక్కెర్ల అందించిన సాహిత్యం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేలా ఉంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యంలో సాగే దృశ్యకావ్యంలా ఈ పాటను చిత్రీకరించడం గోదావరి అందాలను వెండితెరపై ఆవిష్కరించిన తీరు ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తోంది. ఫలితంగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ సాంగ్ మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సాధిస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.

చిత్ర విశేషాల్లోకి వెళితే, ‘మెమ్ ఫేమస్’ చిత్రంతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన సరసన నిధి ప్రదీప్ కథానాయికగా నటిస్తుండగా, జగపతి బాబు ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ రూరల్ లవ్ స్టోరీపై అంచనాలు భారీగా పెరిగాయి. వేసవి కానుకగా మే 8వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. పాటల ద్వారా ఇప్పటికే సగం విజయాన్ని అందుకున్న ‘గోదారి గట్టుపైనా’, వెండితెరపై ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తుందో చూడాలి.

‘గోదారి గట్టుపైనా’ చిత్రంలోని చూడు చూడు.. మిలియన్ల వ్యూస్‌తో నెట్టింట ట్రెండింగ్ - Tholi Paluku